టోక్యోలో జులైలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్ ఒలింపిక్స్‌లో పాల్గంటున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. 43 ఏళ్ల లారెల్ హబ్బర్డ్‌ను కివీస్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం ఎంపిక చేశారు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హబ్బర్డ్ పాల్గనే విషయమై న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. దీంతో క్రీడాలోకంతో పాటు పలువురు లారెల్‌ను ప్రశంసిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేకపోవడం వల్ల హబ్బర్డ్ మహిళల విభాగంలోనే బరిలోకి దిగనున్నారు. ట్రాన్స్‌జెండర్‌గా మారకముందు ఆమె 2013లో మెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు.
జులై 23 నుంచి టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఇందులో మహిళల 87 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె పోటీ చేయనున్నారు. కాగా లారెన్ హబ్బర్డ్ ఎంపిక పట్ల వివాదం చెలరేగుతోంది. మహిళా జట్టుకు లారెల్‌ను ఎంపిక చేయడం వల్ల.. ఆమెకు ఎక్కవ ప్రయోజనం ఉంటుందని కొందరు అంటున్నారు. బెల్జియన్ వెయిట్ లిఫ్టర్ అన్నా వాన్ బెలింగెన్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. హబ్బర్డ్‌ను పోటీలకు అనుమతించడం, అదీ మహిళల విభాగంలో చోటు ఇవ్వడం పెద్ద జోక్ అన్నారు. మరికొందరు మాత్రం ట్రాన్స్‌జెండర్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. న్యూజిలాండ్ ప్రజలు ఇచ్చిన మద్దతుకు హబ్బర్డ్ థ్యాంక్స్ తెలిపారు. 'చాలామంది న్యూజిలాండ్ వాసులు నాకు మద్దతు ఇచ్చారు. నేను వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ఎంపిక చేసిన న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీ (ఎన్‌జిఓసి) కి ధన్యవాదాలు. మూడేళ్ల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో చేయి విరిగినప్పుడు నా క్రీడా జీవితం ముగింపు దశకు చేరుకుందని కొందరు అన్నారు. అయితే అభిమానుల ప్రోత్సాహం ఆ చీకటి నుంచి నన్ను బయటపడేసింది' అని హబ్బర్డ్ తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2015లో తన రూల్స్‌ను మార్చింది. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళల కేటగిరీలో పోటీ చేయవచ్చని పేర్కొంది. అందుకు వారు తాను మహిళ అన్న అంగీకార పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పోటీలకు అనుమతించే సమయానికి ముందు ఏడాది వరకూ ఆమె టెస్టోస్టెరాన్ లెవల్స్ ఐఓసీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐఓసీ లారెల్ హబ్బర్డ్‌కు గ్రీన్ సిగల్ ఇచ్చింది. 'టోక్యో ఒలింపిక్స్‌లో హబ్బర్డ్‌కు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అని న్యూజిలాండ్ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షుడు రిచీ ప్యాటర్సన్ అన్నారు.
అయితే 2018లో గోల్డ్ కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో హబ్బర్డ్ పాల్గనకుండా అడ్డుకోవాలని ఆస్ట్రేలియా వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య కోరింది. కానీ నిర్వాహకులు ఈ చర్యను తిరస్కరించారు. లారెల్ హబ్బర్డ్ అసలు పేరు గెవిన్ హబ్బర్డ్. జూనియర్ స్థాయి పోటీల్లోనే పలు జాతీయ రికార్డులు నెలకొల్పారు. 300 కిలోల విభాగంలో జాతీయ రికార్డు సృష్టించారు. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత 2017లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతంతో పాటు 2019 ఫసిఫిక్ గేమ్స్‌లో స్వర్ణంతో మెరిశారు. 2018 కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్నా, గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.