ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా 1974 ఆగస్టు 10న ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 49 ఏళ్లు పూర్తి చేసుకొని 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అక్టోబర్ 1న స్వర్ణోత్సవాలు విజయవాడలో నిర్వహించనున్నట్లు యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు స్వర్ణోత్సవాల వాల్‌పోస్టర్‌ను పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో, వినుకొండలోని ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ 49 ఏళ్లలో యుటిఎఫ్ ఎన్నో విజయాలను సాధించిందని, విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వానికి అనేక సలహాలు, సూచనలు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన జిల్లాల్లో విద్యారంగం బలోపేతానికి యుటిఎఫ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో చిన్నారులను బడికి పంపిం చేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో యుటిఎఫ్ పాత్ర ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగుల పాత పెన్షన్ విధానం అమలు కోసం యుటిఎఫ్ పోరాడుతోందన్నారు. స్వర్ణోత్సవాల సందర్భంగా బైక్ జాతాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. హిందూపురం నుండి బయలుదేరిన స్వర్ణోత్సవ జాతా గురువారం వినుకొండ, నరసరావుపేటకు చేరుతుందని ఈ రెండు పట్టణాల్లో నిర్వహించే ద్విచక్ర వాహన ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యా రంగ శ్రేయోభిలాషులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారథి, సహాధ్యక్షులు ఎం.మోహన్‌రావు, జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్లు ఖాసీంపీరా, పట్టణ కార్యదర్శి వెంకటేశ్వరరావు, సత్యానంద్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు రవికుమార్, అజరు కుమార్, రాష్ట్ర కౌన్సిలర్‌లు పోలయ్య, నాగరాజు, వినుకొండ మండల శాఖ బాధ్యులు రమేష్‌బాబు, తిరుపతిరెడ్డి, భాస్కర్, రామిరెడ్డి, జిలాని, రామారావు, గోవిందు నాయక్, మల్లికార్జున, నాగేంద్రుడు పాల్గొన్నారు.










