Apr 23,2023 00:42

అనకాపల్లిలో వేడుకల్లో పాల్గొన్న మంత్రి అమర్‌నాథ్‌ బ

ప్రజాశక్తి- ప్రజాశక్తి-యంత్రాంగం
అనకాపల్లి:ముస్లిం సోదరులు రంజాన్‌ వేడుకలను శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శారద నగర్‌ ఈద్గా దర్గా వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌, పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ బివి సత్యవతి పాల్గొన్నారు. దర్గా నిర్వాహకులు ప్రహరీ ఏర్పాటు చేయాలని కోరిన మేరకు మంత్రి అమర్నాథ్‌ తక్షణమే మంజూరు చేశారు. వచ్చే రంజాన్‌ నాటికి పూర్తిస్థాయిలో కాంపౌండ్‌ వాల్‌ నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు.
పరవాడ : మండలంలోని పరవాడ, చీపురుపల్లి, రావాడ పంచాయతీ శివారు గొల్లగుంట గ్రామాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు ఒకరు, కోకరు ఆలింగనం చేసుకుని రంజాన్‌ శుభాకాంక్షలు తేలుపుకునున్నారు. గోల్లగుంటలోని వేడుకల్లో టిడిపి మండల అధ్యక్షులు వియ్యపు చిన్నా సరోజిని దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్‌ యాసిన్‌, షేక్‌ బషీర్‌, షేక్‌ ఖలీల్‌, షేక్‌ మదీనా, షేక్‌ అలీ పాల్గొన్నారు.
కశింకోట : మండలం చింతలపాలెం గ్రామంలో సయ్యద్‌ జాఫర్‌ షా మసీద్‌లో జాఫర్‌ షా రంజాన్‌ పండుగ శనివారం జరిగింది. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్‌ బాబ్జి, షేక్‌ రహిమాన్‌, షేక్‌ ఇస్మైల్‌, షేక్‌ మహమ్మద్‌. రబ్బానీ, షేక్‌ అభ్దుల్‌ రహిమాన్‌ పాల్గొన్నారు. కశింకోటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్‌ నాయకులు యస్‌ కే రెహమాన్‌ (బాబర్‌) పాల్గొన్నారు.
కోటవురట్ల:మండల కేంద్రంలో మక్కా మసీద్‌, మజీద్‌ ఉస్మాన్‌ ఘనీ వద్ద ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మసీదుల్లో మత పెద్దలు మాట్లాడుతూ చెడుకు దూరంగా ఉంటూ మంచి కోసం తపించే మాసమే రంజాన్‌ మాసమని అన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
నక్కపల్లి:మండలంలోని ముస్లిం గ్రామాల్లో శనివారం రంజాన్‌ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. రంజాన్‌ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులు నెల రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టారు. మాసం చివర రోజున నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలను ముగించారు. ముస్లిం గ్రామాలైన బోధిగల్లం, అప్పల పాయకరావుపేట తదితర గ్రామాల్లో మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కంచరపాలెం : జివిఎంసి 53వ వార్డు పరిధి మస్జీద్‌ - ఈ - అల్‌ ఖదిర్‌ మస్జీద్‌ - ఈ -అల్‌ పత లో ముస్లిం సోదరులు శనివారం ఈద్గా స్థలం వద్ద ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నమాజ్‌ ఆచరించారు. వేకువ జామున ఫజర్‌ నమాజ్‌ను ఆచరించిన ముస్లిములు ఆయా మస్జీద్‌ల నుంచి ర్యాలీగా ఈద్గా స్థలాలకు చేరుకున్నారు. ముస్లిం మత గురువులు తక్రిర్‌ పాటించారు. ఖురాన్‌లో సూక్తులు వివరించారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ ఈద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమాన్ని మస్జిద్‌ కమిటీ అధ్యక్షులు మున్నా గౌస్‌ పర్యవేక్షించారు.
ఆరిలోవ : హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ అన్ని మతాల పండుగలను జరుపుకోవడం, మతసామరస్యాన్ని చాటడంలో నార్త్‌ షిర్డి సాయిబాబా ఆలయ కమిటీ ముందుంటుంది. హిందూ పండగలతోపాటు రంజాన్‌, క్రిస్మస్‌ వేడుకలను ఇక్కడ జరుపుకుంటుంటారు. ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా ఆరిలోవలో ఉన్న జహీరుద్దీన్‌ స్నేహ బృందం, బంధు వర్గంప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలమాంబ కాంప్లెక్స్‌లో ఉన్న పోలమాంబ, షిరిడి సాయిబాబా, అయ్యప్ప స్వామి, సదాశివుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఖురాన్‌ పఠనం జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్‌ వానపల్లి అప్పారావు, ఇతర కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన పురోహితులు నగేష్‌ శర్మ ,ప్రభాష్‌, సిబిసిఐడి డిఎస్‌పి నాగేశ్వరి పాల్గొన్నారు. మధ్యాహ్నం ముస్లిం సోదరులు ఆలయంలో పేదలకు అన్నదానం జరిపారు. ముస్లిం సోదరులకు ఆలయ చైర్మన్‌ వానపల్లి అప్పారావు, కార్మదర్శి ఆర్‌ఎ పాత్రో సత్కరించారు.