May 13,2023 01:00

ప్రజాశక్తి - ఎఎన్‌యు : బిఇడి పరీక్షల నిర్వహణలో మరోసారి నాగార్జున యూనివర్సిటీ తన వైఫల్యాన్ని చాటుకుంది. బిఇడి నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను ప్రయోగ పరీక్షలను నిర్వహించకుండానే మార్కులు వేయించారని వివాదం సద్దుమణగకమునుపే థియరీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైంది. మే 9 నుండి వర్సిటీ పరిధిలో బిఇడి కళాశాలలో 4వ సెమిస్టర్‌ థియరీ పరీక్షలు జరుగుతున్నాయి. 173 కళాశాలల్లో 17 వేల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు. 67 కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల్లో ప్రకాశం జిల్లాలో మే 12న జరగాల్సిన పర్యావరణ విద్యా పరిరక్షణ పేపర్‌ 11వ తేదీనే లీకై వాట్సప్‌లలో దర్శనమిచ్చింది. అది వర్సిటీ అధికారులకూ చేరడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మరో ప్రశ్నపత్రాన్ని సదరు సెంటర్‌కు మెయిల్‌ ద్వారా పంపి వాటిని ప్రింట్‌లు తీసి పరీక్ష నిర్వహించారు. కొన్నిచోట్ల 9 గంటలకు, మరికొన్నిచోట్ల 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే కొన్నిచోట్ల లీకైన ప్రశ్న పత్రం కూడా రాసినట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకవ్వడానికి కారకులపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు తెలిపారు.