Apr 25,2021 17:04

ఎటువంటి తప్పూ చేయకుండా అనేకమంది అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయా రాష్ట్రాల్లోని కోర్టులు వెలువరించిన తీర్పులు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే అనేక సందర్భాల్లో బాధితులు శిక్ష అనుభవించిన తర్వాత బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టలేక, కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందలేక మానసికంగా కుంగిపోతుంటారు. అయితే అటువంటి బాధితులుగా ఉండి.. ఒకప్పుడు శిక్ష అనుభవించి.. నేడు అనేకమందికి న్యాయంకోసం పోరాడే ప్రచార కార్యకర్తలుగా మారారు. వారే ఇప్పుడు స్ఫూర్తివంతంగా నిలిచారు. ముంబైకి చెందిన అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌. సెప్టెంబర్‌ 12, 2015న, అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ (43) జైలునుండి విడుదలయ్యారు. చేయని నేరానికి ఆయన తొమ్మిదేళ్లు శిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే తాను శిక్ష అనంతరం ఏం చేయాలో స్పష్టతకు వచ్చారు. దేశవ్యాప్తంగా తప్పుడు జైలుశిక్ష అనుభవిస్తున్న వారికోసం సామాజిక కార్యకర్తగా, న్యాయ సలహాదారుగా పనిచేస్తున్నారు.
   జైల్లో తన చివరిరోజున, తన సహ నిందితులకు ఒక వాగ్దానం చేశాడు. వారి కన్నీటి కథలను ప్రపంచానికి తెలిసేలా చేస్తానని, తద్వార అతనిలాగే వారూ నిర్దోషులని, వారిపైనా అక్రమంగా కేసులు నమోదయ్యాయని ప్రజలకు తెలిసేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వాగ్దానం అమలు చేయడం చెప్పినంత సులువు కాదని తెలుసు. తరచూ జైలు నుంచి విడుదలయ్యే సమయంలో తమలాంటి ఎందరో ఖైదీలకు ఇలాంటి వాగ్దానాలు చేస్తూనే ఉంటారు. అయితే వారిలా వాగ్దానంతో సరిపెట్టకుండా అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ తన కార్యాచరణను అమలుచేస్తున్నారు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు దేశవ్యాప్తంగా ఉగ్రవాద కేసుల్లో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వందలాది మంది ముస్లిం ఖైదీలకు సంబంధించిన కన్నీటి కథలను ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా తనలా శిక్ష అనుభవించిన వారికి అవగాహన కల్పిస్తున్నారు.
   జులై 11, 2006, 7/11 పేలుళ్లుగా పేర్కొన్న ముంబై సీరియల్‌ బాంబు బ్లాస్టుల కేసులో అరెస్టయిన 13 మందిలో నిర్దోషిగా బయటపడిన ఏకైక వ్యక్తి అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌. ఈ పేలుళ్లలో 188 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు. అదే సంవత్సరం జులై, అక్టోబర్‌ మధ్య మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ఎటిఎస్‌) పేలుళ్లకు సంబంధించి అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ సహా 13 మందిని అరెస్టు చేసింది. వివాదాస్పద మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ యాక్ట్‌ (ఎంసిఓసిఎ) కింద అభియోగాలు మోపిన ముంబైలోని ప్రత్యేక కోర్టు, 12 మంది నిందితుల్లో ఐదుగురికి మరణశిక్ష, మిగిలిన ఏడుగురికి జీవితఖైదు విధించింది. అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ ప్రకారం, 12 మందిలో ఎవరూ దోషులు కాదు. వాస్తవానికి, శిక్ష అనుభవిస్తున్నవారు, జైలులో మగ్గుతున్నవారు తనకన్నా ఎక్కువ నిర్దోషులు అని ఆయన బలంగా చెబుతున్నారు. ముఖ్యంగా అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ నగరమంతా బాంబులు వేసిన వారికి ఆశ్రయం ఇచ్చాడన్న ఆరోపణల్లో కీలక సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి 'నేను నిర్దోషిని అయితే, మరి ఆ కేసులోని మిగతావారు ఎలా దోషులుగా అవుతారు?' దర్యాప్తు సంస్థలు నిజమైన నిందితులను కనుగొనలేకపోవడంతో వారిని బలిపశువులుగా చేశారని ఆయన అభిప్రాయం.
 

                                              'బెగునా ఖైదీ' (ఇన్నోసెంట్‌ ఖైదీ)..

   టెర్రర్‌-సంబంధిత కేసులలో నిర్దోషులుగా ప్రకటించిన ఇతరుల మాదిరిగా కాకుండా సమాజానికి తనవంతు సాయంగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. 'నాతోపాటు అరెస్టు అయినవారిలో అనేకమంది నాలాగా నిర్దోషులే అని నేను నమ్ముతున్నాను. అందువల్ల జైలు నుండి బయటపడటానికి, స్వేచ్ఛా జీవులుగా వారి కుటుంబాలతో జీవించడానికి అర్హులు. నాకు, వారికోసం పోరాటం చేయాలనిపించింది... నా స్వంత స్వేచ్ఛ కోసం జకాత్‌ (ఇస్లాం ప్రకారం సమాజానికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత) చెల్లించడం లాంటిది' అని అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ అన్నారు. 'అందువల్లే వారి గురించి అవగాహన కల్పించడం, వారి కేసుల కోసం పోరాటం చేయడం నా లక్ష్యం. తద్వార వారు చివరికి వెలుగును చూడగలుగుతారు' అని వాహిద్‌ చెబుతున్నారు.
   అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ ప్రస్తుతం ముంబైలోని ప్రభుత్వ సహాయక పాఠశాలలో మిడిల్‌ స్కూల్‌ విద్యార్థులకు సైన్స్‌ బోధిస్తున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఉగ్రవాదానికి సంబంధించిన కేసులపై రెండు పుస్తకాలు రాశారు. అతని మొదటి పుస్తకం, బెగునా ఖైదీ (ఇన్నోసెంట్‌ ఖైదీ), మొదట ఉర్దూలో ప్రచురితమైంది. అనంతరం హిందీలో అనువదించారు. ఏకకాలంలో 2017లో రెండు భాషల్లో ప్రచురితమైంది. ఇష్రత్‌ జహాన్‌ యొక్క 'ఎన్‌కౌంటర్‌'తో వ్యవహరించే రెండో పుస్తకం త్వరలో ప్రచురితమవ్వనుంది.
   పుస్తకాన్ని ప్రచురించినప్పటి నుండి, అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ దాని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దేశవ్యాప్తంగా చాలా దూరం ప్రయాణించి, పుస్తక ప్రదర్శనల్లో, బహిరంగ సమావేశాల్లో, జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన సహనిందితులపై ఉన్న అభియోగాలను వివరించడం, వాదనల్లోని నిజాయితీని తెలియజెప్పడమే కాకుండా, అక్షరధామ్‌ ఆలయదాడి (గుజరాత్‌, 2002), ఔరంగాబాద్‌ ఆయుధ రవాణా కేసు (మహారాష్ట్ర్ట, 2006), మాలెగావ్‌ పేలుళ్ల కేసుకు సంబంధించిన విషయాలనూ 'బెగునా ఖైదీ'లో పొందుపరిచాడు. ఒక కేసులో నిందితుడిగా ఉండి, నిర్దోషిగా ప్రకటించిన తర్వాత తనలాగే అమాయకులైన తన సహ నిందితుల గురించి ప్రచారం చేస్తే ఆ ప్రభావం ప్రజల్లో బలంగా ఉంటుందని వాహిద్‌ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అతను తన అనుభవం నుండి మాట్లాడుతున్నాడు. కాబట్టి, ప్రజలు వాటిని తిరస్కరించడం కష్టమవుతుంది. అయితే వారందరితో వాహిద్‌ చెప్పేది ఒక్కటే.. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచమని బలవంతం చేయాలని, లేదా కనీసం సంస్కరణల కోసం పనిచేయమని ఒత్తిడి చేయాలని వాహిద్‌ కోరుతున్నారు.
 

                                                          మహ్మద్‌ అమీర్‌ఖాన్‌

మహ్మద్‌ అమీర్‌ఖాన్‌


   బహుళ ఉగ్రవాద కేసులకు 14 సంవత్సరాల జైలు జీవితం గడిపిన ఢిల్లీకి చెందిన మహ్మద్‌ అమీర్‌ ఖాన్‌(40), అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ అభిప్రాయాలకు బలంగా మద్దతు నిచ్చారు. 14 సంవత్సరాల స్ట్రగుల్‌ టూ ప్రూవ్‌ మై ఇన్నోసెన్స్‌ (2016) పుస్తక రచయిత అయిన అమీర్‌ఖాన్‌ 2012లో విడుదలయ్యారు. ఈ పుస్తకం దాదాపు ఆరు ప్రాంతీయ భాషల్లో అనువాదమైంది. దేశంలో అనేక ప్రాంతాల్లో పర్య టించి, తప్పుడు జైలుశిక్ష అనుభవిస్తున్న వారిపట్ల సమాజం ప్రభావం ఎలా ఉంటుందో అవగాహన కల్పిస్తున్నారు.
 

                                                              బిలాల్‌ కగ్జీ

మహ్మద్‌ అమీర్‌ఖాన్‌

   బిలాల్‌ కగ్జీ(38) సూరత్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాది. ఉగ్రవాద సంబంధిత కేసులో మోపిన అభియోగాలపై అతను 2008లో నాలుగు నెలల జైలు జీవితం గడిపారు. ''నేను మానవహక్కుల ఉల్లంఘన, పోలీసు క్రూరత్వానికి సంబంధించిన కేసుల కోసం పిటిషన్‌ వేస్తున్నాను. కాబట్టి, నేను పోలీసుల నుంచి బెదిరింపులకు గురయ్యాను. నేను మానవహక్కుల గురించి పనిచేయడం ఆపకపోతే ఎన్‌కౌంటర్‌లో చనిపోతావని బెదిరించారు. దీంతో ఆరు తప్పుడు కేసుల్లో ఇరికించబడ్డాను. అయితే రెండు కేసుల నుండి పేరు తొలగించబడింది. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి'' అంటున్నాడు బిలాల కగ్జీ.
   గతేడాది, జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) గుజరాత్‌ ముఖ్య కార్యదర్శికి షో-కాజ్‌ నోటీసు జారీ చేసింది. సూరత్‌ పోలీసులకు అతన్ని నేరస్థుడిగా తప్పుగా ఇరికించినందుకు గుజరాత్‌ ప్రభుత్వం బిలాల్‌ కగ్జీకి పరిహారంగా రూ.లక్ష ఎందుకు చెల్లించకూడదని నిలదీసింది. ప్రభుత్వం ఈ ఉత్తర్వును సవాలు చేసింది. తనకు ఇంకా పరిహారం అందలేదు. 'నాకు పరిహారం లభిస్తుందో లేదో, తెలీదు. అయినా నేను ఇతర కేసుల్లో చిక్కుకున్నా, అన్యాయానికి వ్యతిరేకంగా కొనసాగించే పోరాటం ఆపను..' అని బిలాల్‌ కగ్జీ చెబుతున్నారు.
'నేను ఎందుకు పోరాటం ఆపాలి? న్యాయం, మానవ హక్కుల కోసం పోరాడటం తప్పు ఎలా అవుతుంది?' అంటున్నాడు బిలాల్‌. తనలాంటి వారే చట్టం యొక్క శక్తితో బెదిరింపులకు గురైతే, సాధారణ పౌరులు మనుగడ సాగించడం చాలా కష్టమని 38 ఏళ్ల న్యాయవాది అభిప్రాయపడ్డారు.