Dec 19,2021 14:48

మూడు దశాబ్దాలుగా దళిత మహిళా హక్కుల కోసం ఆమె పోరాడుతున్నారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తున్నారు. 'ఒక్కరు కాదు.. అందరూ ఒక్కటై పోరాడాలి' అనే నినాదంతో 'నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఉమెన్‌ లీడర్స్‌' ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. 'ఈ సంస్థ ఏర్పాటుతో నా కల నెరవేరింది' అంటున్నారు గుజరాత్‌కు చెందిన 52 ఏళ్ల మంజుల ప్రదీప్‌. ఆమె గురించి మరిన్ని విశేషాలు..

చారిత్రకంగా దళితులు సమాజంలో వివక్షను అనుభవిస్తూనే ఉన్నారు. చట్టపరంగా వారికి రక్షణ కల్పించినప్పటికీ, సంఘంలో పక్షపాతం, హింస ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా, మనదేశ మహిళా జనాభాలో 16 శాతం ఉన్న దళిత మహిళలు లైంగిక హింసనూ ఎదుర్కొంటున్నారు. అత్యాచార బాధితులకు ముఖ్యంగా దళిత మహిళలకు న్యాయం చేకూర్చే దిశలో సహాయపడేలా ఎంతోమందికి శిక్షణ ఇస్తుంటారు మంజుల ప్రదీప్‌.
ఎదురుచూడకుండా..
'ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మనలో నుంచే లీడర్స్‌ రావాలి. మనకు జరిగే అన్యాయాలపై పోరాడాలి. హక్కుల చైతన్యాన్ని ఊరూ వాడకు తీసుకెళ్లాలి' అనే ఆశయంతో ఏర్పాటైందే 'నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఉమెన్‌ లీడర్స్‌'.
'దళిత సమాజం నుంచే మహిళా నాయకులు రావాలి. అలాంటి వారిని తయారుచేయాలన్నదే నా చిరకాల స్వప్నం. కోవిడ్‌ మహమ్మారి సమయంలో లైంగిక హింస కేసులను పరిశీలిస్తున్నప్పుడే, దీనికోసం ప్రత్యేకంగా ఓ సంస్థను స్థాపించాల్సిన అవసరం ఉందని గ్రహించాను. అప్పుడే నాకు అర్థం అయ్యింది. లైంగిక హింసకు గురైన మహిళలు గౌరవంగా, హుందాగా జీవనం కొనసాగించడానికి సహాయపడే నాయకులు అవసరమని. మా సంస్థ ద్వారా వారిని తయారుచేయాలన్నదే మా సంకల్పం' అంటున్నారు మంజుల.
అడుగడుగునా అవమానాలు..
మంజుల కుటుంబం ఉత్తరప్రదేశ్‌ నుంచి గుజరాత్‌కు వలస వెళ్లింది. తన తల్లిని తండ్రి విపరీతంగా హింసించేవాడు. మరోవైపు తాను స్కూల్లో కులవివక్షను ఎదుర్కొనేది. ఎటు చూసినా బాధలు, అవమానాలు. అందుకే ఆమె ఇప్పుడు బాధితుల గొంతుక అయ్యింది. తనలాంటి గొంతులు గట్టిగా వినిపించడానికి వేదిక తయారుకావడంలో ఆమె ఒకరయ్యారు. ఆమె తన జీవితంలో జరిగిన సంఘటనలపై 'బ్రోకెన్‌ కెన్‌ హీల్‌: ది లైఫ్‌ అండ్‌ వర్క్‌ ఆఫ్‌ మంజుల ప్రదీప్‌' అనే పుస్తకం ప్రచురితమైంది.
చట్టాలపై అవగాహన కల్పిస్తూ..
'గ్రామీణ మహిళలకు ప్రాథమిక స్థాయిలో చట్టాల గురించి అవగాహన కల్పించాలి. న్యాయ పరిజ్ఞానాన్ని అందించడం అవసరమని గుర్తించాను. అత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు, సమాజం వేసే నిందలతో పోరాడే ధైర్యాన్ని నింపడంలో వారికి సహాయంగా ఉండాలని భావించాను. న్యాయవ్యవస్థ మొత్తం దళిత మహిళలకు వ్యతిరేకంగా పక్షపాతం వహిస్తోంది. కోర్టుల్లో బాధితులను అవమానాలపాలు చేసేలా ప్రశ్నిస్తుంటారు. ఉదాహరణకు ''ఉన్నత వర్గాల పురుషులు ఆమెనే ఎందుకు అత్యాచారం చేస్తారు? ఆమె అంటరాని మహిళ కదా! ఆమే స్వయంగా వారిని ఆహ్వానించి ఉంటుంది..'' లాంటి మాటలతో వారిని ఇబ్బంది పెడుతుంటారు' అంటోంది మంజుల.
దళిత మహిళలపై జరిగే అత్యాచారాలు చాలావరకు వెలుగులోకి రావని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మంజుల ఆ దిశలో శిక్షణ ఇస్తుంటారు. అత్యాచార బాధితులకు ధైర్యాన్ని అందించడం, వివరంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేయడంలో ఆమె శిక్షణ ఇస్తుంటారు.

ఆమె బాధితురాలే..
చిన్నతనంలో తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని, ఎంతో ఒంటరితనం అనుభవించానని, ఆ బాధలోంచే ఈ ఆలోచన పుట్టుకొచ్చిందని చెబుతుంటారు మంజుల. 'ఆ రోజు నేను పసుపు రంగు ఫ్రాక్‌ వేసుకున్నట్లు గుర్తుంది. వారి ముఖాలు, ఏం చేశారో నేను ఇప్పటికీ మరచిపోలేను. ఆ అత్యాచారం నన్ను మార్చింది. అవమాన పీడితురాలిగా, భయస్తురాలిని చేసింది. కొత్త వారిని చూస్తే భయపడేదాన్ని. ఎవరైనా ఇంటికి వస్తే కనిపించకుండా దాక్కునేదాన్ని. ఇంట్లో చెప్పడానికి భయమేసింది. అంత బాధను నేనొక్కదాన్నే భరించా' అంటున్నారు మంజుల.
తనలా మరొకరు కాకూడదనే ఉద్దేశ్యంతోనే స్కూల్‌ చదువుల తర్వాత బరోడాలోని ఓ యూనివర్శిటీలో సోషల్‌వర్క్‌లో మాస్టర్స్‌, గుజరాత్‌ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. దేశంలో అత్యంత కీలకమైన సమస్యగా మారిన అత్యాచార బాధితులపై దృష్టి పెట్టారామె. 50 మందికి పైగా దళిత అత్యాచార బాధితులు చేసిన న్యాయ పోరాటంలో వారికి అండగా ఆమె నిలిచారు. ఈ కేసుల్లో అనేకమందికి శిక్షలు పడేలా కృషి చేశారామె.
ఆమె సహోద్యోగి ఒకరు 1992లో అగ్రవర్ణానికి చెందిన వారి చేతిలో హత్యకు గురయ్యారు. అప్పుడే ఆమె దళిత హక్కుల కోసం పోరాడే 'నవ సర్జన్‌' అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు. ఆ సంస్థలో చేరిన తొలి మహిళ ఆమె. ఒక దశాబ్దం తరువాత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎన్నికలలో విజయం సాధించారు. ఒక దళిత మహిళ ఆ స్థాయికి ఎదగడం చాలా అరుదు. సంస్థను నడిపించడానికి నలుగురు పురుషులను ఓడించి, ఎన్నికల్లో గెలిచారు మంజుల.

ఒక్కరు కాదు.. అందరూ ఒక్కటై పోరాడాలి