Nov 28,2021 12:48

'సార్‌..నిన్న 'రన్నింగ్‌ రేస్‌' పోటీలు పెడతామన్నారుగా ఇప్పుడే పెట్టేస్తారా సార్‌?' చైతన్య ఉత్సాహం.
'మా నాన్న తాగొచ్చీ...పేద్దగొడవ సార్‌.. అందుకే హోం వర్క్‌ రాయలేదనీ.. మా అమ్మ నన్ను తిట్టొద్దని చెప్పమంది సార్‌' పూజిత గోడు.
రేపు..'కార్తీక మాంసం' సెలవిస్తారా?' ఒకటో తరగతి దమరేంద్ర డౌట్‌.
'వర్కులు చూడండి సార్‌?' ఎటు నడిస్తే అటు నోట్సులు పట్టుకుని వెంబడిస్తున్న దేవి!
'ఉండండిరా. ముందు వాష్‌రూమ్స్‌ ఫోటోలు తీయాలి కదా!'
రఘురాం చుట్టూ మూగిన ఐదు క్లాసుల పిల్లల్ని తప్పించుకుని, మొబైల్తో ఆడపిల్లల టాయిలెట్‌ బేసిన్లు క్లోజ్‌గా క్యాప్చర్‌ చేసి.. టి.ఎమ్‌.ఎఫ్‌ యాప్‌లో అప్లోడ్‌ చేశాడు. అది కాసేపు గింజుకుని అప్లోడ్‌ అయ్యింది. బార్సు టాయిలెట్‌ను తీస్తుండగా.. 'ప్లీజ్‌ సార్‌..అర్జంట్‌' నడుం దగ్గర నిక్కరు అంచులు పట్టుకుని మహేంద్ర కాళ్లు నేలకి కొడుతూ వింత నాట్యం చేస్తూ బ్రతిమాలాడు. 'బాబూ...ఈ ఒక్కటీ తీసుకోనీయరా....అసలే మన ఊరిలో సిగల్‌ దొరకదూ' అంటూ రఘు మహేంద్రని బతిమిలాడుతూ... బేసిన్ను క్లోజప్పులో బంధిస్తుండగా రఘురాం అవాక్కయే సంఘటన జరిగింది. ఆగలేని మహేంద్ర, రఘురాంను తోసుకుంటూ పోయి కూర్చోవటంతో రఘు స్మార్ట్‌ఫోన్‌ స్మార్ట్‌గా టాయిలెట్‌ గుంతలోకి జారింది. రఘురాంకి జీర్ణం అవటానికి నిముషం పట్టింది. రెండు గుండెనొప్పులు... ఒకేమారు వచ్చినంత పనైంది. వేల ఖరీదు ఫోనది.., అది లేకుండా ఆ రోజంతా పెట్టాల్సిన ఐ.ఎమ్‌.ఎమ్‌.ఎస్‌, టి.ఎమ్‌.ఎఫ్‌...అటెండెన్స్‌ యాప్‌లలో ఫొటో అప్లోడ్సూ...ఎలా?! నీరసంగా తరగతి కొచ్చి అటెండెన్స్‌ వేశాడు.
హాజరుపట్టీలో వేశాక ఇంకా అటెండెన్స్‌ యాప్‌లో తరగతి హాజరూ, స్కూల్‌ హాజరూ, గుడ్డు తినువాడు, తిననివాడు, అన్నం తినువాడు, తిననివాడు, చిక్కీ తినువాడు, తిననివాడు అంటూ లెక్క అప్లోడ్‌ చేయాలాయె. 'హారి భగవంతుడా ఇప్పుడేం దారీ!?'. 'మహీ బయటకు రావట్లేదు సార్‌...కొడతారని!' ఔత్సాహికుల వార్త కవరేజ్‌! 'కొట్టను.... వాడి మాట విననందుకు నన్ను నేనే కొట్టుకుంటానని చెప్పండి' చెప్పాడు రఘురాం. మహేంద్ర చీమిడి ముక్కుతో వెక్కుతూ నించుని, 'సారి సార్‌'! అన్నాడు. 'పోన్లేరా..నీ తప్పేంలేదు...నేనే కాస్త ఆగకపోతిని. ముఖం కడుక్కుని, మాస్క్‌ పెట్టుకో..పో' అన్నాడు రఘురాం.
రఘురాం ఆయాని పంపి ఆమె కొడుకు ఫోన్‌ తెప్పించుకున్నాడు. 'కార్లో వచ్చిన ఆ సారు మమ్మల్ని బోల్డు ప్రశ్నలు అడిగారు సార్‌'... అంగన్వాడీ బయట చెట్టుకిందున్న వ్యక్తిని చూపించింది పాయల్‌. 'ఎవరబ్బా?!' చూశాడు కానీ, యాప్స్‌పని గుర్తొచ్చి, డౌన్లోడ్‌ ప్రారంభించాడు. గోల చేస్తున్న పిల్లలను ధ్యానం చేయమన్నాడు. సార్‌ నేను 'ప్రాణామాయం' నేర్పనా?' ధనుష్‌ అడిగాడు. 'ఏం వద్దు... ధ్యానం చాలు'. అంటూ గిర్రున తిరుగుతూ విసిగిస్తున్న ఫోన్తో ప్రహరీ దగ్గరకు వెళ్లాడు. బయట ఎవరో అంటున్నారు. 'ఈ టీచర్లు చూడరా..బళ్లోనూ ఫోన్లే... పిల్లలకేం చెబుతారో?' అని విన్న రఘురాంకి మనసు చివుక్కుమంది. 'ఏం తెలుసని అనేస్తారు ఇలా!'.. కాసేపు బడి ఆవరణంతా ఒలెంపిక్‌ జ్యోతిలా ఫోన్‌ పైకెత్తి తిరిగి, మధ్యాహ్న భోజన పథకం యాప్‌ని సాధించుకొచ్చాడు. అటెండెన్స్‌ అప్లోడ్‌ చేయటం సెలవులో ఉన్న టీచర్‌కి కాల్‌ చేసి అప్పగించాడు.
ఇంతలో..శరణ్య తల్లి వచ్చి, 'ఏంటి సారూ...పిల్లకి హోం వర్కు ఇవ్వటం లేదూ?!' అంది. 'కొత్త పుస్తకాల్లోనే వర్క్‌ బుక్‌ ఉందమ్మా.. ఇచ్చాగా!'. 'అయ్యన్నీ గాదు సార్‌....నోట్సులో ఇవ్వండి రాయిపిస్తాను' చెప్పిందామె. 'సరేమ్మా'. అన్నాడు రఘురాం. 'ఇవ్వకుండా ఇచ్చానని మేట్టారే అబద్దాలాడితే ఇగ పిలకాయలేం నేరుస్తరూ?!' సణిగిందామె. ఈ తల్లిదండ్రులు పిల్లలు పడీ పడీ రాసేస్తుండటమే చదువని భ్రమ పడతారేంటో! ప్చ్‌. శనివారం కథల పుస్తకాలు ఇంటికిచ్చి కథ నేర్చుకురమ్మంటాడు రఘు. కానీ ఓ పేరెంట్‌ 'వర్క్‌ ఇవలేదండీ మీరూ.. కతలు సదువుతా కూసున్నాడు ఆదోరమంతా !' అడిగాడు. 'హోంవర్క్‌ అదేనండీ. కథ చదవటం టైం వేస్ట్‌ కాదు. చాలా నేర్చుకుంటారు' అన్నా కూడా, 'సరే. మా వాడికి మటుకూ గట్టిగా వర్కులిచ్చేయండి. బాగుపడతాడు' అంటూ చక్కాపోయాడు.
రఘురాం బోర్డుపె ఐదు క్లాసులకీ సి.డబ్ల్యు రాశాడు. ఏభై రోల్‌ ఉన్న ఆ ప్రాథమిక బడిలో ఇద్దరే స్టాఫ్‌... ఆవిడ ప్రసూతి సెలవులో ఉండటంతో రఘురాం సమయానుగుణంగా పెట్టాల్సిన యాప్స్‌తోనూ, ఆఫీసువారు ఫోన్‌ చేసి అడుగుతున్న ఇన్ఫో, రాయటంతోనూ, అన్ని క్లాసులకూ న్యాయం చేయటంతోనూ సతమతమౌతున్నాడు. ఒకో క్లాసునూ గుండ్రంగా కూర్చోబెట్టాడు. నిశ్శబ్దంగా రాసుకోవాలని చెప్పి, పంపాల్సిన ఇన్ఫర్మేషన్‌ రాస్తుండగా, రేషన్‌ డీలర్‌ వచ్చి 'బియ్యం వచ్చాయి సార్‌' అన్నాడు. ఆయాని కూర్చోబెట్టి బండి మీద రెండుసార్లు రైస్‌ బ్యాగ్స్‌ తెచ్చేసరికి, 'బాలకేసు' రెడీగా ఉంది...
శర్వాణి బుగ్గపై ఎర్రని గాటుతో ఏడుస్తూ చెప్పింది. 'జానూ నా డబ్బరు, తన డబ్బరని లాగేసుకుని గిచ్చింది సార్‌'. ఎందుకలా చేశావ్‌ అని జానూని అడిగితే, 'అది నాదే సార్‌. కావాలంటే పెన్నింకుతో చుక్క పెట్టుకున్నా చూడండి!' అంటూ సాక్ష్యాలూ ప్రొడ్యూస్‌ చేసేసింది. 'ఎందుకు గిచ్చావు చెప్పు?!' రఘురాం కోప్పడ్డాడు. 'చూసుకోకుండా గిచ్చాను సార్‌' అంది జానూ. నవ్వాలో, ఏడవాలో తెలీక రెండు చీవాట్లు పెట్టి, విచారించి ఇస్తానంటూ ఇరేజర్ను సొరుగులో వేయమని శివకిచ్చాడు. ఈ లోగా లంచ్‌ వచ్చేసింది. బెల్‌ కొట్టగానే పిల్లలంతా పళ్లేలు కడుక్కుని వరుసగా కూర్చున్నారు. ఆ రోజు 'స్వీట్‌ రైస్‌' స్పెషల్‌! పిల్లలంతా ఎపుడెప్పుడు తిందామా అని ఆతృతగా ఉన్నారు. ముఖాల్లో ఎంతో ఆనందం! నిజంగా ప్రభుత్వం పిల్లలను సొంత పిల్లలకు మల్లే చూస్తుంది. రకరకాలుగా న్యూట్రీషన్‌ ఫుడ్‌ ఇస్తూ, భావి పౌరుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటోందని రఘురాం గొప్పగా ఫీలౌతాడు.
కానీ, మెనూ ఐటమ్స్‌ మొత్తంగానూ, విడివిడిగానూ, గుడ్డు క్వాలిటీని, స్టోరేజి ఏరియానీ, కుకింగ్‌ ఏరియానీ, మరికొన్ని హైజీనిటీకి సంబంధించిన వివరాలను కాప్చర్‌ చేసి, యాప్‌లో పెట్టేటప్పుడు మాత్రం... చాలా డిప్రెస్‌ అయిపోతాడు. ఎందుకంటే అది ఓ మారుమూల ప్రాంతం. టవర్‌ దగ్గరలో లేకపోవడంతో... సిగల్‌ ప్రాబ్లెమ్‌తో ఫొటోలన్నీ తొందరగా వెళ్లవు. ఒక్కోసారి సగం కాప్చర్‌ చేశాక యాప్‌ డిస్‌ కనెక్ట్‌ అయిపోయి, మళ్లీ మొదటి నుండీ తీయాల్సి వస్తుంది. ఇదంతా చిటికెలో పని కాదు. ఈలోగా పిల్లలు ఆశగా ఎపుడు వడ్డిస్తారాని చూస్తుండటం, అసహనంతో పళ్లేలు దరువులతో హోరెత్తటం, పసివాళ్లు ఆకలితో వెయిట్‌ చేయడం చాలా బాధగా ఉంటుంది. పిల్లలంటే ఉన్న ప్రేమ వల్ల వాళ్లకి ఏం తగ్గినా రఘురాం తట్టుకోలేడు.
రోజూలాగే అప్లోడ్‌ కుస్తీలు పట్టి, ఇరవై నిమిషాలు లేటుగా భోజనం వడ్డించాక, వాళ్లంతా తినే వరకూ ఉండి, జాగ్రత్తగా ఆడుకోమని చెప్పి, తనూ రెండు ముద్దలు నోట్లో పెట్టుకున్నాడు. అంతే గుడ్ల సరఫరా వ్యక్తి వచ్చి లిస్ట్‌ పట్టుకుని, ఎదురుగా నించున్నాడు. మరీ కనికరం లేనివాళ్లు.. భోంచేయండి. ఉంటాం అని ఒక్కడూ చెప్పడు. ఎప్పుడూ తినేటైంకే వస్తారు. రఘురాం క్యారేజీపై మూత పెట్టి, వారానికి ఐదు గుడ్లు చొప్పున తలకాయ లెక్కలేసి, తీసుకుని, పిల్లలకు అందకుండా సెక్యూర్‌ చేసి, టైం అవటంతో బెల్‌ కొట్టేశాడు. విజరు, తాను రాసింది కరెక్షన్‌కి తెచ్చాడు. 'గాంధీజీ సత్యాగ్రామం చేసి మన దేశకు కుతంత్రం తెచ్చాడు. ఎపుడూ సత్యమునె పితికేవాడు. అ హింస ఆయనకు మార్గం.. అందుకే అయనను 'జాతి పీత' అని పిలుస్తారు'. వాడి కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ దెబ్బతింటాయని నవ్వు కంట్రోల్‌ చేసుకుంటూ, 'బాగా రాసావు.. కానీ 'ల' కి బదులు 'తి' రాస్తున్నావు'.. చెబుతుంటే శ్రద్ధగా వింటున్నాడు విజరు.
'సా...ఎవరో వచ్చారు సా...' కీర్తన పొలికేక పెట్టింది. 'రానీయమ్మా! అలా అరవమాక!' అంటుండగా.. తెల్లచీరలో హెల్త్‌ సెంటర్‌ నుంచి ఆరోగ్య కార్యకర్త వచ్చి 'పిల్లలతో ర్యాలీ తీయాలి కదా సార్‌. 'చెంబు చచ్చింది ప్రొగ్రాం కోసం' అంది. 'ఆ మరే..వస్తాం అమ్మా' చెప్పాడు. పిల్లలు వర్కులు చూపించటానికి కుదరనందుకు నిరాశగా బుక్స్‌ బ్యాగుల్లో పెట్టుకున్నారు. ర్యాలీ తీశాక 'టాయిలెట్ల శుభ్రం అందరి బాధ్యత. గాంధీజీ అంతటివారే ఆ పని చేసేవారు. ఇది చాలా మంచి కార్యక్రమం' చెప్పాడు రఘురాం. హెల్త్‌ వాళ్లూ, పిల్లలూ ఎండకు కారే చెమటలు తుడుచుకుంటూ చప్పట్లు కొట్టారు. 'అయ్యో..టైం మూడా?!'.. గబగబా వర్కులు ఇవ్వసాగాడు రఘురాం. పిల్లలంతా మళ్లీ చుట్టూ చేరారు. బయట కుర్చీలో వ్యక్తి ఇటే చూస్తుండటం గమనించాడు రఘురాం. 'ఒక కథ చెప్పరా సార్‌' పిల్లలంతా ఆశగా అడిగారు. 'ఇపుడు కాదురా...రేపు' అన్నాడు పూర్తి చేయాల్సిన గ్రేడింగ్‌ రికార్డును గుర్తు చేసుకుంటూ.
'ఎపుడూ క్లాస్‌ని బుల్లికథతో మొదలుపెట్టుకునే వాళ్లం కద్సార్‌?! అపుడెంత బాగుండేదో!' మోహన్‌ అన్నాడు. 'చాలా కథలు మిస్‌ అయ్యాం... సార్‌ ఈ మధ్య చెప్పటమే మానేశారు' కీర్తన బాధగా అంది. యాప్‌లు కనికరించి మిగిల్చిన సమయంలో పాఠాలకే కుస్తీ ఔతుంది. పిల్లలకేం తెల్సు పాపం. కథలు అడగటం వారి హక్కు! చెప్పలేకపోవడం నా ఫెయిల్యూరా?!' గొణుక్కున్నాడు బాధగా. పద్యాల పోటీల్లో ఎన్నో ప్రైజ్‌లు తెచ్చేవారు. ఇప్పుడిక, లెక్కలు నేర్పడం, పాఠాల్ని తెలుగు మీడియం వారికోసం తెలుగులోనూ, ఇంగ్లీష్‌ మీడియం వారికోసం ఇంగ్లీష్‌లోనూ చెప్పుకోవటం, ఆవిడ సెలవులో ఉంటే ఐదు క్లాసుల భారం మోయటం, సమయం గిర్రున జరిగిపోతోంది.
'ఆటలు ఆడీ పాటలు పాడీ అలిసీ వచ్చానే' గేయం చెబుతుంటే అన్ని తరగతి వాళ్లూ జాయిన్‌ అయి గెంతుతున్నారు. కేరింతలతో సమయం ఆహ్లాదమైపోయింది. తాళాలు వేయిస్తుండగా శర్వాణి నుంచుంది. 'నా డబ్బరు సార్‌' అంటూ. 'శివా... శర్వాణి రబ్బరటరా..' అనటంతోనే.. 'ఉండండి సార్‌. పొద్దున్న మీ డ్రాయర్‌లో వేశాగా' అని తెచ్చిచ్చాడు. బడి మూసి బైక్‌ తీస్తూ చూడగా కుర్చీలో వ్యక్తి ఏదో రాసుకుంటున్నాడు. పలకరించే మూడ్‌ లేక బయటపడ్డాడు రఘురాం. దార్లో ఉర్దూ టీచర్‌ అజీజ్‌ కనపడితే బండి ఎక్కించుకున్నాడు. 'ఏంటి అజీజ్‌... అలా సగమైపోయారు?'. 'నాడు- నేడు పనులన్నీ సమ్మర్లోనే కదా భారు...తిరుగుడు ఎఫెక్ట్‌' నవ్వాడు అజీజ్‌. 'ఏమైనాగానీ బళ్లన్నీ ఎ క్లాస్‌ గున్నరు భారు! బట్టలు క్వాలిటీగా, కంటికి ఇంపైన రంగుల్లో పిలగాళ్లు క్లాస్‌గా కనపడుతున్నారు!' రఘురాం మెచ్చుకున్నాడు. 'నిజమే.. ఈసారి క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదు విద్యావ్యవస్థ' అజీజ్‌ ఏకీభవించాడు. 'ఔనూ.. భారు.. ఇన్ని పథకాలూ, పుస్తకాలూ, అవి ట్రాన్స్పెరెన్సీగా జరిగేందుకు ఇన్ని యాప్లూ... అన్నీ దేనికోసమంటావ్‌?' అజీజ్‌ అడిగాడు ఉన్నట్టుండి. 'ఇంక దేనికోసం భారు... పిల్లాడి చదువుకోసమే కదా!?'. 'మరి అదెక్కడ భారు?!'. 'నా బాధా అదే అజీజ్‌ ! యాప్‌లలో అన్నీ పెట్టామా!.. వెళ్లాయా! ఇదే టెన్షను... ప్చ్‌.. పాఠం చెప్పే తీరిక కోసం ఒత్తిడైపోతుందనుకో. రఘురాం గొంతులో బాధ. 'చెప్పమని మాత్రం నిన్నెవరు అడిగారు భారు! భలే వాడివీ...ఇంత ఎమోషన్స్‌ ఉంటే ఎట్లా?' అజీజ్‌ నవ్వాడు. 'మనస్సాక్షి' అని ఒకటేడుస్తది కదా అజీజ్‌. అడక్కపోయినా అందరం చెబుతాం. ఇపుడిపుడే మనల్ని నమ్మి, ఇంగ్లీష్‌ మీడియం కూడా చెబుతున్నామని కాన్వెంటులనుండి పిల్లలిని తెచ్చి అప్పగించారు పేరెంట్స్‌. మాట నిలేసుకోపోతే...మన ఉనికికే ప్రమాదం వస్తుంది కదా!'. రెండు తలల పాములా రోడ్డు వాళ్లని లాక్కుపోతూనే ఉంది. మౌనంగా ఉన్న రఘు కళ్లముందు బడి పిల్లల అయాయకపు ముఖాలు నిలిచాయి.
ఎన్నో అడగని ప్రశ్నలు వేళ్లాడేసుకున్న పసి ముఖాలు!. ఎవరినీ నిలదీయడం తెలీని అమాయకపు ముఖాలు!! తనవైపు నమ్మకంతో చూసే ఆశల ముఖాలు!!!. టీ తాగుతూ ఎఫ్‌.ఎ.మార్కులు అప్‌లోడ్‌ చేసేందుకు సిస్టమ్‌ ముందు కూర్చున్నాడు. ఓపెన్‌ అవుద్దో...లాస్ట్‌ టైంలా అర్ధరాత్రి అవుద్దో..ప్చ్‌. ఫోన్‌ రింగయ్యింది..' ఈ నెంబరుకి ఎవరబ్బా?'... ఆన్సర్‌ చేశాడు రఘురాం. 'రఘురాంగారు.. స్టేట్‌ అబ్జర్వేషన్‌ డిపార్ట్మెంట్‌ నుంచి. మానిటరింగ్‌ ఆఫీసర్ని'. 'ఔనా సార్‌..?! న..నమస్తే' గొంతు ఆరిపోయింది రఘురాంకి. 'ఈ రోజంతా మీతోనే ఉన్నాను. గ్రౌండ్‌ లెవెల్లో పథకాల అమలు పరిశీలన నిమిత్తం. సింగిల్‌గా మీరెంతో కష్టపడుతూ అన్నీ అమలు జరపటం అభినందనీయం. 'నాతో ఉన్నారా?!'. యా.. ఎన్నో కార్యక్రమాల నడుమ పిల్లలకు న్యాయం చేయాలని ఒత్తిడిని భరిస్తూ చెప్పే పాఠాలు... మీ ఓపిక అన్నీ చూశాను'.
'సార్‌!' 'నా రిపోర్ట్‌ హై కమాండ్‌కి పంపుతాను. ఫలితంగా మీ ఒత్తిడి తగ్గుతుందనే ఆశిస్తున్నాను. 'థేంక్యూ సార్‌!' రఘురాం తబ్బిబ్బయాడు. 'థాంక్స్‌ చెప్పకండి. మీలాంటి ఓ గురువు వల్లే నేనింత చదివి వృద్ధిలోకి వచ్చాను. తీర్చిదిద్దే చేతులను మెషీన్లుగా మారనీకూడదు. విద్యార్థికి మీ సహజ చేతి స్పర్శ చాలా అవసరం'. ఫోన్‌ కట్‌ అయ్యింది. రఘు అలసటగా కళ్లుమూశాడు. 'గొప్ప పౌరులను తయారుచేస్తున్నట్లు' వచ్చే పాత కల మళ్లీరెప్పల్లో సిద్ధంగా ఉంది.

మనోజ నంబూరి
9491733100