ప్రజాశక్తి - రాజుపాలెం : దేవాదాయ భూములను సాగు చేస్తున్న కౌలురైతులను ఈ-క్రాప్‌లో నమోదు చేయడంతోపాటు వారికి కౌలురైతు గుర్తింపు (సిసిఆర్‌సి) కార్డులు జారీ చేయాలని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. మండలంలో చౌటపాపాయపాలెం, నెమలిపురి గ్రామాల్లో దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులను వారు శుక్రవారం కలిసి మాట్లాడారు. ప్రభుత్వం నుండి అందుతున్న సహకారం, సాగు పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. తమకేమీ అందడం లేదని వారు చెప్పడంతో విఆర్‌ఒ, దేవాదాయ శాఖాధికారిని కలిసి పరిస్థితిని వివరించారు. దేవాదాయ భూములను సాగు చేసే వారికి కౌలురైతు గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఆదేశాలున్నాయని, అయినా వాటిని ఇవ్వడం లేదని అడిగారు. అయితే దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు తమకు ఇంకా చేరలేదని, వస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారి సమాధానమిచ్చారు. సాగుదార్ల వివరాలను దేవదాయ శాఖ ఇవో తమకు అందిస్తే గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియ చేపడతామని విఆర్‌ఒ చెప్పారు. ఇదిలా ఉండగా వివిధ అంశాలపై రాధాకృష్ణ, హరిబాబు మాట్లాడుతూ మండలంలోని ఐదు గ్రామాల పరిధిలో 250 మంది దేవాదాయ భూములను సాగు చేస్తున్నారని, వీరందరికీ సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్డుల మంజూరుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులిచ్చినా పలు రకాల సాకులతో ఇంకా మంజూరు చేయలేదని అన్నారు. వ్యవసాయం అనేక ఒడితుడుకులతో సాగుతోందని, అయితే సాగుదార్లను ఈ-క్రాప్‌లో నమోదు చేయని కారణంగా వారికి రుణాలు, బీమా అందడం లేదని, సిసిఆర్‌సి కార్డులు లేని కారణంగా రాయితీలు, రైతు భరోసా వర్తించడం లేదని చెప్పారు. దేవాదాయ భూముల సాగుదారుల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రైతుభరోసాను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ భూములను ఒకరి పేరుతో కౌలుకు ఇచ్చినా సబ్ లీజు కింద అనేకమంది ఇతరులు సాగు చేస్తున్నారని, ఈ క్రమంలో వాస్తవ సాగుదార్లనే ఈ-క్రాప్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌలుదార్లకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలివ్వాలన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ రాయితీలు, బీమా, రైతు భరోసా, ఇతర సదుపాయాలు వర్తించలేదని, అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి పిచ్చిరెడ్డి, వెంకయ్య, నాగయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ పాల్గొన్నారు.










