ప్రజాశక్తి - పల్నాడుజిల్లా కరస్పాండెంట్ : ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని అధికారులు, సిబ్బందిని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. నియోజవకర్గ స్థాయి నుండి బూత్‌స్థాయి అధికారులు, సిబ్బందితో కలెక్టర్ మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఓటర్ల నమోదుతోపాటు ఆధార్ అనుసంధానం, వందేళ్లు వయసు దాటిన ఓటర్ల వివరాలు, ట్రాన్స్ జెండర్స్, చనిపోయిన వారి వివరాలను సేకరించి తొలగింపుకు తదితర అంశాలను అడిగారు. ఎవరైనా ఓకే వ్యక్తి ఎక్కువ మంది ఓటర్ల నమోదు చేస్తుంటే దానిపై విచారణ చేయాలని, వివరాలను సేకరించి అవసరమైతే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఇంటి నంబర్లు లేనివారి వివరాలు సేకరించడం, ఒకే ఇంట్లో 10 మందికి పైగా ఓటర్లుంటే వెంటనే విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వడం చేయాలని చెప్పారు. ఓటరు వివరాల నమోదులో తప్పులు లేకుండా చూడాలని, కళాశాలల ద్వారా యువ ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇళ్లులేక రహదారుల వెంట ఉంటున్న వారు, బస్‌షెల్టర్స్ వద్ద ఉంటున్న వారి వివరాలను సేకరించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. వివరాలన్నీ శుక్రవారం లోగా తమకు నివేదించాలని ఆదేశించారు. సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరామచంద్రమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వేగంగా పిఎసిఎస్‌ల కంప్యూటరీకరణ
వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్) కంప్యూటరీకరణను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీనిపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షలో మాట్లాడుతూ జిల్లాలో 59 పిఎసిఎస్‌లు, ధూళిపాళ్ల రైతుల సేవా సంఘం కలిపి మొత్తం 60 సంఘాల్లో కంప్యూటరీకణ చేపట్టాల్సి ఉందన్నారు. ముందుగా రుణ వితరణ సంస్థల కంప్యూటరీకరణకు తప్పనిసరిగా కావాల్సిన మానిటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం, పాస్ బుక్ ప్రింటర్లు సత్వరమే ఏర్పాటు చేయాలన్నారు. రెండవ విడతలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ సామాగ్రి కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నాగశ్రీనివాస్, డిసిసిబి సిఇఒ కృష్ణవేణి, పిఎసిఎస్ అభివృద్ధి అధికారి నాగేశ్వరరావు, ఈపూరు, శావల్యాపురం, నరుకుళ్లపాడు పిఎసిఎస్‌ల సిఇఒలు కోటేశ్వరరావు, నాగప్రసాద్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










