Aug 01,2021 15:41

చిలకలూరిపేట : అవినీతిని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ.... కొండపల్లిలో నిజాలను వెలికితీసేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కొండపల్లిలో ఎలాంటి అక్రమాలు, అన్యాయాలు జరగలేదని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు దేవినేని ఉమ పరిశీలనకు వెళ్తే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. సీఎం జగన్‌ నాయకత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న వనరులను దోచుకుంటూ రూ.200కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు కొల్లగొడుతున్నారని ఆయన తెలిపారు. చిలకలూరిపేటలో రోజూ 500 లారీల మట్టి, ఇసుక తరలిపోతోందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వలనే రోడ్ల అభివృద్ధికి మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.