Aug 20,2023 23:50

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌: అభివద్ధి, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి అడ్డగోలుగా సహజ వనరులు దోచుకుంటున్న జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టు కుందని పర్చూరు ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓట్టేయరనే భయంతోనే అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్ది పార్టీల మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇసుక దర్శిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇసుకను దొరకుండా చేసి సామాన్యులు అందుకోలేని విధంగా ధరలు పెంచారని అన్నారు. మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచి దోపిడీ చేస్తున్నారని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌, కొకైన్‌ వంటి విష పదార్థాల వ్యాపారంతో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పర్చూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని మూడు నెలలుగా ప్రచారం చేసి నేడు 10వేల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారులే వైసిపి కార్యకర్తల్లా పనిచేసే పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఓట్ల తొలగింపు కుట్రలపై తాను అప్రమత్తంగానే ఉన్నానని అన్నారు. ఈపాటికే రెండుసార్లు పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. వైసిపి అధికార కుట్రలో ప్రజాస్వామ్య హక్కుగా ఉన్న ఓటు హక్కు ప్రమాదంలో పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో పర్చూరు నుండి టిడిపికి 25వేల మెజార్టీతో పసుపు జెండా ఎగురేస్తామని అన్నారు. ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడిన అధికారులకు బుద్ధి చెబుతామన్నారు. న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తొలుత టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి చీరాల ఇంచార్జ్‌ ఎంఎం కొండయ్య, టిడిపి మండల అధ్యక్షులు నల్లపునేని రంగయ్యచౌదరి, పోద వీరయ్య, నాయుడు హనుమంతరావు, షేక్‌ షంషుద్దీన్‌, తిరుమలశెట్టి శ్రీహరి, తాటి నాగేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.