Aug 31,2023 00:38

ప్రజాశక్తి - క్రోసూరు : స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు బుధవారం చేపట్టిన పెన్‌డౌన్‌ జయప్రదమైంది. ప్రతిరోజూ 20-30 దస్తావేజులు రిజిస్టర్‌ అయ్యేవి. అయితే పెన్‌డౌన్‌ నేపథ్యంలో బుధవారం ఒక్క దస్తావేజూ రిజిస్టర్‌ కాలేదు. కక్షిదార్లు లేక కార్యాలయం వెలవెలబోయింది. ఈ సందర్భంగా నాయకులు ఎస్‌.రామీరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డ్‌ప్రైమ్‌ 2.0 వల్ల దస్తావేజు లేఖర్లు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజలకు సహాయ పడుతూ ఉపాధి పొందతున్న తమపై ఈ చర్యలు సరికావని అన్నారు. క్రోసూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద సుమారు 50 మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని, ప్రభుత్వ చర్యతో వీరంతా రోడ్డున పడతారని ఆందోళన వెలిబుచ్చారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు ప్రైమ్‌ 2.0 విధానంతో కక్షిదారులకు సమస్యలు వస్తాయన్నారు. డాక్యుమెంట్లు తమ అవసరాలకు అనుగుణంగా రాయిచుకునే అవకాశం ఉండదన్నారు. ఒరిజినల్‌ దస్తావేజులు ఉండక పోవటంతో కక్షిదారుల్లో గందరగోళ నెలకొంటుందని, డిజిటల్‌ సంతకాలు ఫోర్జరీకి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇదిలా ఉండగా స్థానిక కార్యాలయంలో ప్రతిరోజూ 40 నుండి 70 వరకు రిజిస్ట్రేషన్‌ అవుతుంటాయి. పెన్‌డౌన్‌ నేపథ్యంలో ఒక్కటీ కాలేదు. ఒక్కో దస్తావేజుకు కనీసం రూ.20 లక్షల ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేస్తే ప్రభుత్వానికి రూ.1.50 ఆదాయం వస్తుంది. ఈ లెక్కన స్థానిక కార్యాలయం ద్వారా రోజుకు రూ.15-20 లక్షల వరకు ఆదాయం ఉంటుంది.
ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల దీక్ష శిబిరాన్ని జై భీం భారత్‌ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జె. విజరుకుమార్‌ సందర్శించి మద్దతు తెలిపారు. బి.మల్లేశ్వరరావు, సిహెచ్‌.కోటేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, ఎం.సుధాకర్‌రావు, జె.కమల కుమార్‌, ఎం.పద్మారావు, ఎం.దేవరాజ్‌ పాల్గొన్నారు.