ప్రజాశక్తి - రెంటచింతల : రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. బిఇడి, డిఇడి పూర్తి చేసిన 5 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం నిరీక్షిస్తున్నారని, అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదని విమర్శించారు. మండల కేంద్రమైన రెంటచింతలలోని యుటిఎఫ్ కార్యాలయానికి ఆదివారం వచిచన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 10,200 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2014 జూన్ రెండు నాటికి ఐదేళ్ల సర్వీసు నిండి ఉండాలనే నిబంధన పెట్టడం వల్ల 4 వేల మంది నష్టపోయారని చెప్పారు. 1998 డీఎస్సీకి సంబంధించి 6,800 మంది గాను 4,072 మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మిగతా వారంతా నిరాశతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 కేజీబీవీల్లో పనిచేస్తున్న సిఆర్‌సి వాళ్లకు మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పి కేవలం 23 శాతమే జీతం పెంచారన్నారు. రెంటచింతలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో తీర్మానం ప్రతిపాదించి వెంటనే అమలు చేయాలన్నా పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. పల్నాడులో ఉన్నత విద్యాభివృద్ధికి పీజీ సెంటర్ ఏర్పాటు అవసరమని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వెంట యుటిఎఫ్ మండల అధ్యక్షులు జాన్ విజయ రాజ్ కుమార్, ఓర్సు సాగర్‌బాబు, గౌరవాధ్యక్షులు డాక్టర్ చిన్నమ్మ, సాల్మన్‌రాజు నాసరయ్య, మల్లికార్జున, జోష్పిన, ప్రతాప్, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.










