విజయవంతంగా రెండు ఆపరేషన్లు చేసిన విశాఖ కిమ్స్ ఐకాన్ వైద్యులు
వైద్యచరిత్రలోనే అరుదైన ఘటన
ప్రజాశక్తి -గాజువాక : వైద్యచరిత్రలోనే అరుదైన ఘటన విశాఖ షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో ఆవిష్కృతమైంది. ఒకే వ్యక్తికి ఒకే రోజులో, కొన్ని గంటల వ్యవధిలో మూత్రపిండాలు, కాలేయం రెండు అవయవాల మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. మృత్యువు ముంగిట ఉన్న రోగికి ఎపి జీవన్‌దాన్ ద్వారా లభ్యమైన లివర్, కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి, కొత్త జీవితాన్ని, మారుజన్మను అందించారు. ఆపరేషన్ తర్వాత రెండు వారాలపాటు రోగిని పూర్తిస్థాయి పర్యవేక్షణలోనే ఉంచి, అన్నీ సాదారణంగా ఉన్నాయని నిర్థారించుకున్నాక డిశ్ఛార్జి చేశారు. దీనికి సంబంధించి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ చలపతిరావు ఆచంట, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆర్‌కె.మహేష్ వెల్లడించిన వివరాలివి.
హెపటైటిస్ 'సి' కారణంగా కాలేయ కేన్సర్, లివర్ సిరోసిస్‌తో బాధపడుతూ, కాలేయం పూర్తిగా పాడైన రోగికి, మరోవైపు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (క్రానికల్ కిడ్నీ డిసీజ్-సికెడి) కూడా ఉండడంతో సాదారణ చికిత్సలు చేసినా ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడని పరిస్థితి ఉంది. కిడ్నీ, లివర్ రెండు అవయవాలను మార్చితే గానీ, రోగి బతికే పరిస్థితి లేనిస్థితిలో రెండు అవయవాలను ఒకేసారి సేకరించడం, వాటిని రోగికి విజయవంతంగా అమర్చడం పెద్ద సమస్య కావడంతో రోగి ప్రాణాలపై ఆశ వదులుకునే పరిస్థితి ఉంది. అవయవదానం చేసే దాతల కోసం అత్యవసరంగా ఎదురుచూడాల్సి వచ్చింది.
బ్రెయిన్‌డెడ్ వ్యక్తి అవయవాలతో జీవనదానం
ఇటీవల శ్రీకాకుళంలో బ్రెయిన్‌డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి ఒక మూత్రపిండం, కాలేయం రెండు అవయవాలు జీవన్‌దాన్ ద్వారా ఒకేసారి సరైన సమయంలో లభించడం,అతి తక్కువ సమయంలోనే ఆ రెండింటినీ ట్రాన్ల్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా చేయడం ద్వారా మృత్యుముఖంలో ఉన్న రోగి ప్రాణాలను కాపాడగలిగామని కిమ్స్ ఐకాన్ వైద్యనిపుణులు వెల్లడించారు.కొద్దిగంటల వ్యవధిలో నిర్వహించిన రెండు శస్త్రచికిత్సలూ విజయవంతం కావడంతో రోగి వేగంగా కోలుకున్నారని, పది రోజుల తర్వాత పరీక్షించగా, కాలేయం, మూత్రపిండాలు రెండూ సాధారణ స్థాయిలో పనిచేస్తుండడంతో డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు.
విజయవంతంగా పలు అవయవ మార్పిడి ఆపరేషన్లు
అత్యాధునిక వైద్య పరికరాలతోపాటు నిబద్ధత, అంకితభావంతో పనిచేసే నిపుణులైన వైద్యబృందం అందుబాటులో ఉండడంతో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో అనేక అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తూ రోగులకు ప్రాణదానం చేస్తున్నామ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో అనేక అవయవ మార్పిడి ఆపరేషన్లను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 16 కాలేయ మార్పిడులు, 120 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో జరిగాయని, ఇంకా. అనేకమంది రోగుల ప్రాణాలు కాపాడగలిగామన్నారు. రెండుసార్లు రెండేసి అవయవాలను రోగులకు మార్చడం, ఆ రెండు శస్త్రచికిత్సలూ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అవయవదానంపై ఎపి జీవన్‌దాన్ కమిటీ చేస్తున్న విస్తృత ప్రచారం, ప్రజల్లో అవగాహన వల్ల అవయవ దానానికి పలువురు ముందుకు వస్తున్నారని, తద్వారా అవయవ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేపట్టి, వేరే రోగుల ప్రాణాలను నిలుపుతున్నామన్నారు.










