Oct 29,2022 23:43

తల్లీకొడుకులు పుష్ప, సాయికుమార్‌

కొద్ది నెలల క్రితమే తండ్రి అకాల మరణం
అనాధగా మిగిలిన ఏకైక కుమార్తె
ముంచంగిపుట్టులో పేద కుటుంబంలో విషాదం
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:
మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లీ కొడుకులిద్దరూ మృతి చెందగా, కుమార్తె అనాధగా మిగిలిపోయింది. దీనికి సంబంధించిన వివరాలివి. మండల కేంద్రంలోని సంతబయలు వీధి లో నివాసముంటున్న గంపరాయి కృష్ణ కొద్ది నెలల క్రితం మృతి చెందాడు. అతని భార్య గంపరాయి పుష్ప (40) తీవ్ర మనోవేదనకు గురై, రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించింది. శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి చితిమంటలు ఆరకముందే ఇంటికి మగదిక్కుగా ఉన్న ఆమె కుమారుడు సాయికుమార్‌ శుక్రవారం రాత్రి హఠాన్మరణం పొందాడు. సాయికుమార్‌ మరణానికి కారణాలు తెలియరాలేదు. కొద్ది నెలల క్రితం తండ్రి, ఇపుడు ఒకేరోజున తల్లీకొడుకుల మరణంలో ఆ నిరుపేద కుటుంబంలో మిగిలిన ఏకైన కుమార్తె ప్రియాంక అనాధగా మారిపోయింది. కొద్దినెలల క్రితం వరకు తల్లిదండ్రులు, అన్నాచెల్లెళ్లతో కళకళలాడిన కుటుంబం, చూస్తుండగానే కకావికలమై ముగ్గురు మరణంతో ఇపుడు ఒకేఒక ఆడబిడ్డ అనాధను చేసింది. తండ్రి మరణం బాధ వెంటాడుతున్న పరిస్థితుల్లో, ఇపుడు తల్లితోబుట్టువు మరణంతో అనాధగా మారిన ప్రియాంక గుండెలుబాదుకుంటూ కన్నీరుమున్నీరుగా పెడుతున్న రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి. మన్యంలో అనారోగ్య మరణాలకు, కారణం లేకుండానే చోటుచేసుకుంటున్న చావులతో గిరిజన కుటుంబాలు చిన్నాభిన్నమౌతున్నాయడానికి ఇపుడు ఏకాకిగా మిగిలిన ప్రియాంక కుటుంబమే నిదర్శనమని మన్యవాసులు వాపోతున్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువు అకాలమరణంతో ఒంటరిగా మిగిలిన ప్రియాంకను ఇపుడు ప్రభుత్వమే ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.