Jun 04,2022 06:25

  • జూన్‌ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం

'ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2022' నినాదమైన 'ఒకే ఒక భూమి' ప్రచారానికి మద్దతు ఇవ్వడం ద్వారా...ఈ ప్రత్యేకమైన, అందమైన గ్రహం మానవాళికి సౌకర్యవంతమైన నివాసంగా ఉండేలా కృషి చేయాలి. దీనికి ప్రజా శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు... కలిసికట్టుగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. పర్యావరణ హితమైన అభివృద్ధిని ప్రభుత్వాలు చేపట్టేలా చూడాలి.

   కల ప్రాణులకు నివాసం భూమి. భూగోళాన్ని ఆవరించి వున్నది పర్యావరణం. ఈ పర్యావరణమే సకల జీవరాశులకు జీవనాధారం. అన్ని ప్రాణులు హాయిగా జీవించగలగాలి. దీనినే జీవ వైవిధ్యం అంటాము. అది మంచి పర్యావరణం లోనే సాధ్యం. మానవుల స్వార్థపూరిత కార్యకలాపాలు, ప్రభుత్వాల పెట్టుబడిదారీ, కార్పొరేటీకరణ విధానాలు పర్యావరణానికి ప్రమాదంగా, మానవాళి ఉనికికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయి.
       పర్యావరణానికి జరుగుతున్న నష్టం, ప్రమాదం గురించి పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే వున్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం (యు.ఎన్‌.ఇ.పి) పర్యావరణ పరిరక్షణకు పూనుకున్నది. 1972లో స్టాకహేోమ్‌లో జరిగిన మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి మొదటి కాన్ఫరెన్స్‌ కోసం ''ఓన్లీ వన్‌ ఎర్త్‌'' నినాదాన్ని ప్రకటించింది. ఇది ప్రపంచ ఎజెండాలో భూగ్రహ స్థిరమైన అభివృద్ధిని చేర్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటుకు దారితీసింది.
     యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌ఇపి) నేతృత్వంలో 1974 నుండి ఏటా జూన్‌ 5న పర్యావరణ దినోత్సవం నిర్వహించబడుతున్నది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ కాముకుల కోసం అతి పెద్ద ప్రపంచ వేదిక. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీనిని స్వీడన్‌ నిర్వహిస్తోంది. ''ఒకే భూమి'' అనేది ప్రచార నినాదం, ''ప్రకృతితో సామరస్యపూర్వకంగా జీవించడం''పై దృష్టి సారించబడింది.
     విశ్వంలో బిలియన్ల కొద్దీ గెలాక్సీలు ఉన్నాయి. మన గెలాక్సీలో బిలియన్ల కొద్దీ గ్రహాలున్నాయి. కానీ ఒకే ఒక భూగ్రహం ఉందనేది గమనించాలి. వాతావరణం చాలా త్వరగా వేడెక్కుతోంది. ఫలితంగా ఆవాస నష్టం, ఇతర ఒత్తిళ్లు వలన ఒక మిలియన్‌ జాతులు, జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉందని అంచనా.
     మనం పీల్చే గాలి, నివసించే భూమి, ఉపయోగించే నీటిని కాలుష్యం విషపూరితం చేస్తూనే ఉంది. ఈ శతాబ్దంలో గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉంచాలంటే, 2030 నాటికి వార్షిక గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను మనం సగానికి తగ్గించాలి. తగిన చర్యలు తీసుకోకుండా, సురక్షితమైన మార్గదర్శకాలను పాటించకపోతే 2040 నాటికి 50 శాతం వాయు కాలుష్యం పెరుగుతుంది. అంతేగాక జలావరణంలోకి ప్రవహించే ప్లాస్టిక్‌ వ్యర్థాలు దాదాపు మూడు రెట్లు పెరుగుతాయి.
     సంవత్సరానికి 700 బిలియన్‌ డాలర్లకు పైగా ఆయుధాలపై ఖర్చు చేస్తూ ప్రపంచం నలుమూలలా యుద్ధ స్థావరాలను నెలకొల్పుతూ పర్యావరణ విధ్వంసానికి అమెరికానే ప్రధానమైన కారణం అవుతున్నది. అంగారక గ్రహానికి అమెరికా దేశాన్ని బదలాయిస్తాననే రియల్‌ ఎస్టేట్‌ రాజాధిరాజు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి అమెరికా విధానాలకు అద్దం పడుతుంది. ఉన్న భూగ్రహాన్ని పరిరక్షించకుండా అంగారక గ్రహానికి అర్రులు చాచడం పర్యావరణ పరిరక్షణ పట్ల అమెరికాకు గల చిత్తశుద్ధిని శంకిస్తున్నది. 2008-2012 నాటికి వాతావరణం లోని విష వాయువుల సాంద్రత 1990 నాటి స్థాయి కంటే 5 శాతం తగ్గించాలని జపాన్‌లో 1997 క్యోటో ఒప్పందం జరిగింది. 1998లో అతి ప్రమాదకర స్థాయిలో ''ఎల్‌నినో'' ఏర్పడి ఉపద్రవాల అవకాశాల్ని పెంచింది. అది చరిత్రలో అతి వేడి సంవత్సరంగా గుర్తించబడింది. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్‌ గొరె తన 'నిష్టుర సత్యం' (యాన్‌ ఇన్‌కన్వీనియంట్‌ ట్రూత్‌) అనే అధ్యయనం ద్వారా ఈ వాతావరణ సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు ప్రపంచ ఆలోచనాపరులు ముందుంచినా అమెరికా విధానంలో మార్పు రాలేదు.
    క్యోటో ఒప్పందం ప్రకారం ధనిక దేశాలు పరిశ్రమల ద్వారా వాడబడే విష వాయువుల్ని దశాబ్ద కాలంలో కనీసం 5 శాతమైనా తగ్గించుకోవాలి. కానీ గత 15-20 సంవత్సరాలలో అవి తగ్గకపోగా 10 శాతం పైన పెరిగాయి. అమెరికా ద్వారానైతే 17శాతం పైన పెరిగాయి. అయినా 2001లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఏకపక్షంగా క్యోటో ఒప్పందాన్ని పక్కకు పెట్టాడు.
     ఐక్యరాజ్యసమితి యు.ఎన్‌.ఇ.పి శిఖరాగ్ర సదస్సులలో చేసిన తీర్మానాలు ఆచరణకు నోచుకోవడంలేదు. ప్రపంచ జనాభాలో 17 శాతంగా వున్న భారతీయులు సాలీనా 3 శాతం మలినాలు వదులుతూ వాతావరణ మార్పుల పరంగా పెద్ద దేశాల స్థాయిలో పరిగణించబడడం విడ్డూరం.
    'భారత్‌ వంటి దేశాల్లో 10-12 శాతం ప్రజలు తమ జీవన విధానం, వనరుల వాడకం వలన వాతావరణ పతనానికి కారణమౌతున్నారు. అమెరికా వంటి ఐరోపా దేశాల్లో 75-85 శాతం ప్రజలు ఇంధన వాడక స్థాయి, వనరులను కొల్లగొట్టే విధానం వాతావరణ మార్పులకు మూలమౌతున్నార'ని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు ఆల్‌ గొరె వివరించడం గమనార్హం. అయితే 'భారత్‌, చైనా వంటి అధిక జనాభా దేశాలు పర్యావరణ పతనానికి బాధ్యత వహించాలి. పారిశ్రామిక ఐరోపా దేశాలు కాద'ని వక్ర భాష్యం చెప్పి మరీ పారిస్‌ ఒప్పందం నుండి అమెరికా వైదొలుగుతున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగక మిత్ర ఐరోపా దేశాలను కూడా ఆ విధంగా చేయమనడం వెనక పర్యావరణ పరిరక్షణలో అమెరికా చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతున్నది.
     భారత్‌ ఈ వాతావరణ మార్పుల్లో తమ పాత్ర తక్కువ అంటూనే లోపల మాత్రం పూర్తిగా అమెరికాకు వత్తాసు పలికే విధానాన్ని రూపొందించుకున్నది. దీనికి కారణం అమెరికా భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి స్థాయి కల్పించడమే. పైగా కాలం చెల్లిన, ప్రజలు వ్యతిరేకించిన టెక్నాలజీని అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంటకట్టడం గోరుచుట్టుపై రోకటిపోటుగా అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ట్రంప్‌ ప్రభుత్వంతో చేసుకున్న కొవ్వాడ అణు విద్యుత్‌ ఒప్పందం ప్రజా పోరాటాలతో వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు బైడెన్‌ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని తిరగదోడింది. బలవంతంగా ప్రజా వ్యతిరేకతను త్రోసిరాజని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో కేంద్రం ఆరు అణు రియాక్టర్ల ఏర్పాటును వై.సి.పి ప్రభుత్వంతో వేగవంతం చేయించే పనిలో వుంది. గుజరాత్‌ ప్రజలు వ్యతిరేకించిన ఈ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం కొవ్వాడలో ఏర్పాటు చేయడం భారత ప్రజల కోసమా? అమెరికా ప్రయోజనం కోసమా? ఆలోచించాలి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పర్యావరణానికి, వ్యవసాయం- ప్రజారోగ్యాలకు హాని కలిగించే అణు రియాక్టర్లను కొవ్వాడలో ఏర్పాటు చేయడం ఎవరికోసం? అమెరికా, ఆ దేశ కార్పొరేట్ల కోసం కాదా ?
      ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గోదావరి, కృష్ణా నదీ తీరాలలో రక్షణ కవచం లాంటి మడ అడవులను ఇళ్ల స్థలాలు...పర్యాటక రంగ అభివృద్ధి పేర సాగిస్తున్న కార్యకలాపాల వల్ల... పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది. రాయలసీమలో యురేనియం తవ్వకాల వల్ల కూడా పర్యావరణానికి ప్రమాదమే. భూమికి, పర్యావరణానికి చేటుచేసేలా మితిమీరిన ఆక్వా సాగును ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. పర్యావరణ ప్రేమికులు, రైతాంగం, పర్యావరణవేత్తలు చేసే విజ్ఞప్తులను పక్కకు నెట్టడం ఎవరికోసం? పర్యావరణానికి నష్టం చేసే ఇటువంటి కార్యకలాపాలవల్ల జీవవైవిధ్యం దెబ్బతిని కాలుష్యం పెరుగుతుంది. అడవుల ధ్వంసం వల్ల వర్షాభావం ఏర్పడి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా భూతాపం పెరుగుతుంది.
     ఈ ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి మనకు తక్షణ చర్యలు అవసరం. ''ఒకే ఒక భూమి''ని కాపాడుకుంటూ ప్రకృతికి అనుగుణంగా స్థిరంగా జీవించడంపై దృష్టి పెట్టాలి.
     ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2022 నినాదమైన 'ఒకే ఒక భూమి' ప్రచారానికి మద్దతు ఇవ్వడం ద్వారా, ఈ ప్రత్యేకమైన, అందమైన గ్రహం మానవాళికి సౌకర్యవంతమైన నివాసంగా ఉండేలా కృషి చేయాలి. దీనికి ప్రజా శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు కలిసికట్టుగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. పర్యావరణ హితమైన అభివృద్ధిని ప్రభుత్వాలు చేపట్టేలా చూడాలి.

/ వ్యాసకర్త : ఎ.పి జన విజ్ఞాన వేదిక పర్యావరణ సబ్‌ కమిటీ
రాష్ట్ర కన్వీనర్‌, సెల్‌ : 85000 04953 /
కె.వి.వి సత్యనారాయణ

కె.వి.వి సత్యనారాయణ