Aug 06,2023 23:12

బిసి సంక్షేమశాఖ అధికారి ఇ.అనురాధ

* వసతిగృహాల్లో ఉద్యోగుల సర్దుబాటు
* నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యం
* పిల్లల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ వసతిగృహాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా బిసి సంక్షేమశాఖ అధికారి ఇ.అనురాధ తెలిపారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమశాఖల పరిధిలోని వసతిగృహాల పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో ఉమ్మడి కార్యాచరణ అమల్లోకి రానుందన్నారు. ప్రస్తుతం మూడు శాఖల పర్యవేక్షణకు డివిజన్‌ స్థాయిలో ఉన్న పోస్టులను కుదించి ఒకరికి ఆ బాధ్యతలను అప్పగించనున్నట్లు చెప్పారు. వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన బోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో బిసి సంక్షేమశాఖ పరిధిలో సుమారు 70వేల మంది వరకు బాలబాలికలు వసతి సౌకర్యాలను పొందుతున్నారని చెప్పారు.
వసతిగృహాల్లో ఉద్యోగుల కొరతను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారా?
జిల్లాలో వసతిగృహాల్లో ఉద్యోగుల కొరత ఉంది. ప్రతి హాస్టల్‌ నిర్వహణకు సంక్షేమాధికారి పర్యవేక్షణలో నలుగురు ఉద్యోగులు తప్పనిసరి. కుక్‌, కమాటీ, వాచ్‌మెన్‌, స్వీపర్‌ వంటి ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఉంటే నిర్వహణకు వీలవుతుంది. జిల్లావ్యాప్తంగా రెగ్యులర్‌ ఉద్యోగుల సంఖ్య ఏటా తగ్గుతోంది. తాత్కాలిక పద్ధతిలో అవుట్‌సోర్సింగ్‌ సేవల ద్వారా కొంతమందిని నియిమించడమైంది. విద్యార్థుల సంఖ్యను బట్టి అక్కడ సిబ్బంది నియామకాలు జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు మూడు సంక్షేమ శాఖలు ఒకే గొడుగు కిందకు వస్తే మిగులు ఉన్న చోట్ల సర్దుబాటు వీలవుతుంది. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్నిరకాల చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.
వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
జిల్లాలో 81 బిసి వసతిగృహాలు ఉన్నాయి. అందులో 18 పోస్టుమెట్రిక్‌ వసతిగృహాల కాగా మిగిలినవి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నవి. పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాల్లో 10 బాలికల కోసం నిర్వహిస్తున్నాం. కట్టుదిట్టమైన భద్రతతో పాటు అన్నిరకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేవిధంగా వసతిగృహాల నిర్వహణ ఉంది. వీటికితోడు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ వసతిగృహాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులను కల్పించేందుకు వీలుగా ఈ మార్పులు రానున్నాయి.
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
వసతిగృహాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. సీజనల్‌ వ్యాధుల వల్ల అస్వస్థతకు గురయ్యే ప్రమాదం వసతిగృహాల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు స్కూల్‌కు తప్ప ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా పూర్తి కట్టడి చేయడం జరుగుతోంది. అందులో భాగంగా సంక్షేమాధికారుల పర్యవేక్షణ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు, చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నట్లయితే అందరితో కాకుండా వేరే గదిలో ఉంచి వారికి వైద్యం అందించేలా ఆదేశాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, వెల్ఫేర్‌ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి.
వసతిగృహాల్లో మెనూ అమలు ఎలా సాగుతోంది?
ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వసతిగృహాల్లో మెనూ అమలు తప్పనిసరి. ధరల పెరుగుదల వల్ల ఎక్కడైనా సంక్షేమాధికారులు మెనూ అమలును నిర్లక్ష్యం చేస్తున్నట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల ఆరోగ్యం, ఆహార నియమావళిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వారికి పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే పర్యవేక్షణ చేస్తున్నాం. పర్యవేక్షణకు తగినంత మంది వార్డెన్లు లేరు. ఒక్కో వార్డెన్‌కు పక్కనున్న హాస్టల్‌ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాం.
శీతాకాలానికి దుప్పట్ల సరఫరాకు ప్రభుత్వానికి నివేదించారా?
ఏటా శీతాకాలం రాక ముందే వసతిగృహాల్లో విద్యార్థులు నిద్రించే గదులకు మెస్‌లను అమర్చుతున్నాం. దుప్పట్లు సకాలంలో అందజేస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటికే వసతిగృహాలకు అవసరమైన సౌకర్యాల కోసం ప్రభుత్వానికి నివేదించాం. అక్టోబరు నాటికి దుప్పట్లు సరఫరా అయ్యే అవకాశం ఉంది.