అవును..
నిన్నొక సారి చూడాలని ఉంది.
నువ్వు నా దరికి చేరి..
నీ కమ్మని స్వరంతో సరాగాలు పలుకుతుంటే..
నా కళ్లు కలువులై వికసించేవి..
హృదయం పురివిప్పి నాట్యమాడే మయూరమయ్యేది..!
మా ఇంటి పెరడులో
పచ్చని జామచెట్టు కొమ్మపై
మనం కూర్చొని
కబుర్లు చెప్పుకోవడం
ఇంకా గుర్తుంది..!
వేకువ జామున నువ్వొచ్చి
నీ వయ్యారి రూపంతో
నా మనసు కొల్లగొడుతుంటే..!
అదొక అనిర్వచనీయమైన అనుభూతి..!
మా ఇంటి చూరులోంచి
నీ కొంటెచూపులతో
నన్ను చూస్తుంటే..
నా కంటికి ఇంపుగా ఉండేది.
ఒంటికి పన్నీటి జలకమాడినట్లుండేది..!
అవును ..
నిన్ను చూసి ఎన్నిరోజులైంది..!?
నీ ఆచూకీ కోసం
సరిహద్దుల్నించి..
ఇంటికి వచ్చే తనయుడికోసం
అమ్మ చూసినంత
ఆతృతగా ఎదరుచూస్తున్నాను
మనం మాట్లాడుకునే మర్రిచెట్టు ఆనవాలేదీ..!?
అక్కడ కాంక్రీటు వనమొచ్చి
ఆకాశ హార్మ్యాలు
నన్ను అగంతకుడ్ని చూసినట్లు చూస్తున్నాయి
నువ్వుండే చోటు లేదని
అలిగి అదృశ్యమైపోయావా..!?
వాడు నిర్మించిన
చరవాణి టవర్లు కక్కే
పొగల సెగలకు..
నీ ఉనికినే కోల్పోయావా..!?
నీ కోసం ఎప్పటిలానే..
గుప్పెడు గింజలతో..
గుండె గదిలో
చెప్పలేనంత ప్రేమను నింపుకుని
వెన్నలకై నిరీక్షించే
ఛకోర పక్షిలా ఎదురు చూస్తున్నాను.
ఒకసారి కనిపించవూ..!
కె.ఎ.రాజు
95502 34204