గుండెలోని నాలుగు గదులన్నీ
చీకటి మేఘాలను కమ్ముకున్నాయి.
రోజులన్నీ కళ్లులేని దేహాలై గడుస్తున్నాయి.
ఆశయాలన్నీ అంధకారంలో చిక్కుకొని..
గమ్యంలేని గాలిపటాలై ఎగురుతున్నాయి.
బతుకు నిత్యం సుడిగుండాల...
కష్టాల కడలిలో చిక్కుకొని కదలాడుతుంది
ఇప్పుడొక చిన్నిదీపపు వెలుగు కావాలి
అనునిత్యం అంతరంగాన్ని అన్వేషిస్తూ..
ఎదలో నన్నుతట్టిలేపే ఒక ప్రేరణ కావాలి
మోడుబారిన వృక్షాలు మళ్ళీ చిగురిస్తున్నట్లు..
హృదయంలో పట్టుదలను మొలిపించే ధైర్యం కావాలి
జీవితపు దారిపొడవునా నన్ను ఆహ్వానించే..
రహదారిలాంటి ఒక విజయపు దారి కావాలి
జారిపడుతున్న కలలన్నీ ఇపుడు...
గుప్పిట పట్టుకొని.. శ్రమజీవపు రెక్కలు తొడుక్కొని..
ఆకాశం అంచున ఎగిరే పక్షినై సాగాలి
చిన్ని దీపపు వెలుగురేఖలను..
కాగడాల్లా మలుచుకొని చీకటి పొరలను
చీల్చుకొనిపోయే మిణుగురులా సాగిపోవాలి
నిశీధి కమ్ముకున్న విశ్వాన వెలుగులు
విరజిమ్మే తారాజువ్వనై వెలిగిపోవాలి
ఆగిపోయిన జీవితపు కాలాన్ని..
మళ్ళీ పరుగులుపెట్టించి.. షిఫ్ట్ పక్షిలా దూసుకుపోవాలి
ప్రశ్నిస్తున్న కాలానికి..ఒంట్లో నరాలన్నీ
బిగబట్టిన పిడికిలిలా మారి..
విజయపు తోరణాలతో స్వాగతం పలకాలి
రేపటి స్వప్నాలను ముడేసుకొని నడుస్తున్న కాలాన్ని
బానిసగా చేసుకొని.. పేదరికపు గాయాన్ని
పట్టుకొనే వల విసిరి..గెలుపుదరికి చేరాలి
ఇన్నాళ్లూ చీకటిగదిలో చిక్కిన జీవితానికి..
ఉషోదయపు రవికిరణాల వెలుగులు కావాలి
అశోక్ గోనె
94413 17361