ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. లాక్‌డౌన్ సమయంలో కొందరు తినడానికి తిండిలేక ఆకలిదప్పులను అనుభవిస్తే, మరికొందరు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ లాక్‌డౌన్ మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో 12 గ్రామాల మహిళల జీవితాల్నీ మార్చేసింది. ఒక ఐడియా వారిని స్వావలంబన దిశగా అడుగులు వేయించింది. లాక్‌డౌన్ సమయంలో ఏమి జరిగింది? ఆ ప్రాంతంలోని బంజరు భూములన్నీ పంట పొలాలుగా ఎలా మారాయో తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో 12 గ్రామాల ప్రజలు ఎక్కువగా గిరిజనులే. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. కానీ పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న జాబితాలో వారి కుటుంబాలున్నాయి. రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే వారికి కష్టంగా ఉన్న స్థితి. భూమి ఉన్నా పెట్టుబడులు పెట్టే స్థోమత లేక ఎక్కువమంది వలసలుపోతున్నారు. వాస్తవానికి వలసలు వారి జీవితాల్లో ఏ పూటకాపూట పస్తులుండకుండా మాత్రమే చేయగలిగాయి. అంతకుమించి డబ్బు ఆదా చేసుకోవడానికి ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ సమయంలో సొంతూర్లకు తిరిగొచ్చిన వాళ్లు ఎలా బతకాలి? అని ఆలోచిస్తున్న సమయంలోనే స్థానిక ఎన్‌జివో నేతృత్వంలోని ప్రభాత్ జల్ రక్షణ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ అయిన 'పోషన్ వాటిక' (న్యూట్రిషన్ గార్డెన్) వారి జీవితాల్ని మార్చేసింది.
స్వావలంబన దిశగా..
లాక్‌డౌన్ సమయంలో ప్రభాత్ జల్ రక్షణ యోజన సమన్వయకర్తలు మొండ్కితాల్ గ్రామ ప్రజలకు సులభతరంగా తోటపని ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారు. అంతే 1600 చదరపు అడుగుల భూమిలో వారు పాలకూర, మెంతి, ముల్లంగి, టమోటా, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, అల్లం, కొత్తిమీర, దోసకాయ, గుమ్మడి, పండ్లు, బొప్పాయి, నిమ్మ, జామతోపాటు కూరగాయలనూ పండించడం ప్రారంభించారు. మూడు నెలల్లోనే వారి శ్రమ ఫలించింది. ఆదాయం రావడం మొదలైంది. వీరిని చూసి మరో 11 గ్రామాల మహిళలు 'పోషన్ వాటిక' ద్వారా పంట పండించడానికి ముందుకొచ్చారు. నేడు ఈ ప్రాజెక్ట్‌లో 144 మంది మహిళలు ఉన్నారు. వీరంతా అనేక బృందాలుగా ఏర్పడి, వ్యవసాయం చేస్తున్నారు.
కౌలుకు భూమి
'పోషన్ వాటిక ప్రయాణం మెండ్కితాల్‌లో నా భూమి నుంచే ప్రారంభమైంది. ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న నా భూమి నేడు ఎందరికో పోషకాహారాన్ని అందిస్తుంది. మా రైతు బృందం నా భూమి వాడుకున్నందుకు ఏడాదికి రూ. 10 వేలు కౌలు చెల్లిస్తుంది. మొదట ఆరు వేల మొక్కలను నాటడానికి వీలుగా వృత్తాలు గీశారు. కలుపు మొక్కలు తీయడం, మొక్కల నిర్వహణ సులభంగా ఎలా చేయాలో వారంతా శిక్షణ తీసుకున్నారు' అంటున్నారు సవితా కుస్రం అనే మహిళా రైతు.
కుటుంబ భాధ్యత తీసుకున్నాం !
'పనికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు డబ్బును ఆదా చేసుకోలేకపోయాం. పైగా మేం ఏళ్ల తరబడి పట్టణాలలో గడిపినందు వల్ల గ్రామంలో మా భూమి సరైన నిర్వహణ లేక సత్తువ కోల్పోయింది. లాక్‌డౌన్ సమయంలో కుటుంబాల బాధ్యతను మహిళలమే తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్‌లో చేరినందు వల్ల కొంత డబ్బు ఆదా చేసుకో గలుగుతున్నాం. అంతేకాదు గతంలో మేమెప్పుడూ పౌష్టికాహారం తిన్నదే లేదు. ఆరు నెలల నుంచి పౌష్టికాహారాన్ని తినగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. మేమంతా బృందంగా కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్నడూ అలసిపోలేదు. వాస్తవానికి పని పట్ల మరింత అవగాహనను పెంచుకున్నాం' అంటోంది మహిళా రైతు రత్నియా.
మరో మార్గం లేదు..
'డిసెంబర్ 2020 నుంచి మే 2021 వరకు 12 పోషన్ వాటికాస్ నుంచి మహిళలు రూ. మూడు లక్షలు సంపాదించారు. ఒక్కొక్క మహిళ రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఆదా చేశారు. కరోనా సమయంలో బంజరు భూమిలో సాగు చేయడం తప్ప, వీరి ముందు మరో మార్గం లేదు. వీళ్లు ఒకరికొకరు ప్రేరేపించుకుని, అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని, పంటను సాగు చేయగలిగారు. ఈ ప్రాజెక్ట్ వల్ల మరొక ఉపయోగం ఏమిటంటే వీరందరిలో పోషకాహారంపై అవగాహన పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత ముఖ్యమని అర్థమయ్యింది' అంటున్నారు ప్రాజెక్ట్ సమన్వయ కర్త చండీప్రసాద్. త్వరలోనే మరికొన్ని గ్రామాలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమై, స్వావలంబన దిశగా అడుగులు వేయాలని మనమూ కోరుకుందాం.