Dec 27,2020 12:15

ఆకారం, పరిమాణం, పరిమళం అన్నీ నిండైన పువ్వు గులాబీ. అందుకే గులాబీని పువ్వుల్లో రాణీ పువ్వుగా పిలుస్తారు. తెలుగు చిత్రాల్లో గులాబీల మీద ఉన్నన్ని పాటలు మరే పూల మీదా లేవు. గులాబీ పూలలో వందల రంగులూ రకాలూ ఉన్నాయి. చూడగానే ఆహా అనిపించే ఆహార్యం గులాబీ సొంతం. నిజానికి ఇది ముళ్ళజాతి మొక్కైనప్పటికీ శీతల ప్రాంతాల్లో ఎక్కువ నిగారింపుగా విచ్చుకుని, ఘాటైన సువాసనలు వెదజల్లుతుంది.


గ్లాడియేటర్‌, సర్పంచ్‌, డబుల్‌ డిలైట్‌ కలర్‌, హైబ్రీడ్‌, మార్నింగ్‌ గ్లోరీ, సన్సెట్‌, కాశ్మీర్‌, కాకినాడ, రేఖ, ముద్ద వంటి రకరకాల పూలమొక్కలు ఉన్నాయి. నవంబర్‌ నెల రాగానే కడియం నర్సరీలన్నీ గులాబీల కొలువుగా మారిపోతాయి. గులాబీల వలన బహుళ ప్రయోజనాలున్నాయి. అలంకరణకు, మాలలు అల్లుకోవడానికి, దండలుగా కట్టడానికి, ముఖసౌందర్య క్రీముల్లోనూ, ఫేస్‌వాష్‌ ద్రావణాల్లోనూ గులాబీ పూలను వాడతారు. ప్రపంచంలో అన్నిదేశాల్లోనూ, ప్రాంతాల్లోనూ పెరిగే ఏకైక పూలమొక్క గులాబీనే. దీనిని కుండీల్లోనూ, నేల మీదా పెంచవచ్చు. ఇవి ఇంటి ముందుంటే ఇంటికే కళ. ఈ మొక్క ఎర్రమట్టి, చల్లని ప్రాంతాల్లో పెరుగుతుంది. ప్రస్తుతం కడియంలో రూ.50 నుంచి 300 రూపాయలు విలువ చేసే గులాబీమొక్కలు అందుబాటులో ఉన్నాయి.

హైబ్రీడ్‌ గులాబీ
గులాబీనే అందం. అందులో హైబ్రీడ్‌ గులాబీ అంటే దాని శోభితం మనం వర్ణించలేం. ఇవి మొగ్గగా ఉన్నా, పువ్వుగా విచ్చుకున్నా హైబ్రీడ్‌ గులాబీ చాలా అందంగా ఉంటుంది. అందుకే ప్రేమకు ప్రతిరూపంగా.. స్వాగత కానుకలుగా.. హైబ్రీడ్‌ గులాబీ మొగ్గలనే ఆత్మీయంగా అందిస్తారు. హైబ్రీడ్‌ గులాబీ పూల తోటలు బెంగళూరులో విస్తారంగా ఉన్నాయి. అక్కడి వాతావరణానికి పువ్వులు బాగా విచ్చుకుంటాయి. హైబ్రీడ్‌ గులాబీలను బెంగళూరు గులాబీలు అనీ అంటారు.

ఓహో గులాబీ..!

డబుల్‌ డిలైట్‌ కలర్‌ రోజ్‌
రెండు రంగుల కలబోతతో డబుల్‌ డిలైట్‌ కలర్‌ రోజ్‌ ఎంతో కనువిందు చేస్తుంది. రంగులు చిలికినట్లు, డిజైన్లు వేసినట్లు, ముక్కలు అతికించినట్లు పూరేఖలు వర్ణ వయ్యారాలతో అబ్బురపరుస్తాయి. ఇవి ఇంపైన సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. ఈ సువాసనలు చాలా దూరం వరకూ గుప్పిస్తాయి.

ఓహో గులాబీ..!

కల సాకారమైన నీలం పువ్వులు
ఎట్టకేలకు పుష్పప్రియుల నీలం గులాబీలు కల సాకారమైంది. ఫ్లోరికల్చర్‌ శాస్త్రజ్ఞుల కృషి ఫలితం ఈ నీలిరంగు రోజాలు. ముదురు నీలం రంగులో మొక్క నిండుగా పూలు విరబూస్తాయి. కొద్దిగా సుగంధంతోబాటు, కాంతుల మెరుపులూ విశిష్టంగా ఉంటాయి.

ఓహో గులాబీ..!

గ్లాడియేటర్‌
పువ్వుల్లో రాణిపువ్వు గులాబీ అయితే ఆ గులాబీలకి రాణి గ్లాడియేటర్‌. ఒక్కోపువ్వు అరచేతి పరిమాణంలో ఉండి, మూడు నాలుగు రోజుల వరకూ విచ్చుకుని ఉంటుంది. ఇవి శీతల ప్రాంతాల్లో అయితే మరింత పెద్దగా విచ్చుకుంటాయి. ఈ పువ్వులను మన దేశం నుంచి అప్పుడప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తారు.

ఓహో గులాబీ..!

కాకినాడ గులాబీ
కాకినాడ గులాబీని దేశవాళీ గులాబీ అని కూడా పిలుస్తారు. తోటలుగా వేసి పెద్ద ఎత్తున పువ్వులు సాగు చేసే గులాబీలు ఇవి. దండలు కట్టడానికి, రేఖలు చేయడానికి, అలంకరణకు, తైలాలకి, సౌందర్య క్రీములకు ఎక్కువగా ఈ పూలనే వాడతారు.
 

ఓహో గులాబీ..!

కాశ్మీరీ గులాబీ
రేఖలు మాదిరిగా ఉండి చెట్టు నిండుగా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. పువ్వులు మొక్క నుంచి తుంచితే రేఖలుగా రాలిపోతాయి. మొక్కతో ఉంటే చాలా అందంగా ఉండి, సువాసనలు గుప్పిస్తాయి. ఇంటి ముంగిట ఇలాంటి మొక్కలుంటే భలే అందంగా ఉంటాయి. ఇవి కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోవచ్చు.

ఓహో గులాబీ..!

నల్ల గులాబీ
ప్రకృతిలో నల్ల రంగు పువ్వులు చాలా అరుదు. నల్లరంగు గులాబీ మొక్కలు కడియం నర్సరీల్లో చాలా అరుదుగా లభిస్తాయి. విదేశాల్లో వీటిని 'ఫ్లవర్‌ ఆఫ్‌ షాడో' అంటారు. ఇటీవల కాలంలో తమ వ్యతిరేకతా, నిరసనలు తెలపడానికి నల్ల గులాబీలను ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు అందరూ ఈ అరుదైన గులాబీలను 'డార్క్‌ డార్లింగ్‌' అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.

ఓహో గులాబీ..!

లారైన్‌ విక్టోరియా:
ఇవి పువ్వు కాస్త చిన్నగా ఉండి, రేఖలతో పొట్లం కట్టినట్టు ఉంటాయి. మధ్యలో పసుపురంగు పుప్పొడులుంటాయి. సువాసనలు వచ్చినప్పటికీ మొక్క నుంచి తుంచగానే పూరేఖలు రాలిపోతాయి.

మేలైన గులాబీ ఎంపిక ఇలా
గులాబీ మొక్కను తీసుకునేటప్పుడు మేలైన రకాన్ని ఇలా ఎంపిక చేసుకోవాలి. మొక్క కనీసం 18 అంగుళాలు ఉండాలి. మూడు కొమ్మలైనా తప్పనిసరిగా ఉండాలి. దానికి కనీసం మూడు మొగ్గలు, రెండు పువ్వులు, 18 ఆకులు కలిగి ఉండాలి. మట్టిలో కాకుండా కొబ్బరి పొట్టులో పెంచిన మొక్కైతే మరీ మంచిది.
                                                                 * చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506