ప్రజాశక్తి-పార్వతీపురం : జిల్లాలో మొబైల్ టవర్ల ఒఎఫ్‌సి కేబుళ్లు వేసేందుకు అటవీ అనుమతులు మంజూరు చేస్తూ జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. పాచిపెంట మండలం తోటవలస నుండి మోతుమూరు వరకు ఒఎఫ్‌సి కేబుళ్లను వేయుటకు 1.65 ఎకరాలను కేటాయించారు. పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో ఉన్న 55 మందికి ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలకు గాను 61.34 ఎకరాల స్థలానికి అటవీ అనుమతులిచ్చారు. రెవిన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, మంజూరు చేసేందుకు సిఫార్సులు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సామాజిక మార్పుకు, వైద్య అత్యవసర పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అధిక ప్రాముఖ్యత దృష్ట్యా వీటిని మంజూరు చేసినట్లు కమిటీ తీర్మానించింది. ఈ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, జిల్లా అటవీ అధికారి జిఎపి ప్రసూన, పార్వతీపురం ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారి ఎ.మురళీధర్, గుమ్మలక్ష్మీపురం జెడ్‌పిటిసి ఎం.రాధిక, జియో ప్రతినిధులు పాల్గొన్నారు.










