Jun 08,2023 00:01

కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్న గనిశెట్టి, వెంకటాపురం గ్రామస్తులు

ప్రజాశక్తి-పరవాడ
ఒడిశాలోని బాలసోర్‌ రైలు ప్రమాదాల్లో మృతి చెందినవారికి సిఐటియు ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం స్థానిక ఫార్మసిటీలో కొవ్వెత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది మృత్యువాత పడటం, మరో వెయ్యి మందికి పైగా క్షతగాత్రులుగా మారి దేశంలోనే అత్యంత విషాద ఘటనగా మారిందని పేర్కొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వేలో ప్రైవేటీకరణ జరిగిందని, 3 లక్షల వరకు రైల్వే శాఖలో ఖాళీలు భర్తీ చేయలేదని, ఈ కారణంగానే ఈ ఘోర ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, రైల్వే ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి వెంకినాయుడు, కర్రి పోతి నాయుడు, రామునాయుడు, వై అప్పారావు, కె.ధారబాబు, కృష్ణ పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : ఒడిశా రైలు ప్రమాద ఘటనకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో రైలు ప్రమాద మృతులకు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయవరపు సురేష్‌, వానపల్లి సత్యనారాయణ, చిన్నికృష్ణ, సుందరపు వెంకట అప్పారావు, ఏవీఎస్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.