Sep 20,2023 22:46

ధరల పతనానికి తోడు వైరస్‌ దాడి
20 శాతానికి పడిపోయిన సాగు
ఏడాదిగా ఇదే పరిస్థితి
ప్రజాశక్తి-రాజోలు
రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో అధిక శాతం కోనసీమ ప్రాంతంలోనే సాగవుతున్నాయి. అలాంటిది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చెరువులు ఖాళీ అవుతున్నాయి. మిలియన్‌ డాలర్ల పంటగా పేరొందిన వనామీ రొయ్యలకు తెగుళ్లుసోకడంతో రైతులకు నష్టాలు.. కష్టాలు తప్పడం లేదు. వరుస ప్రతికూల పరిస్థితులతో నిద్రపోలేని పరిస్థితులు నెలకొన్నాయని సాగుదారులు వాపోతున్నారు. నిర్వహణ వ్యయాలు పెరిగాయని, మేతల కంపెనీలు ధరలను అమాంతం పెంచడం, పలు రకాల ఛార్జీల పేరుతో ప్రభుత్వం అదనపుభారం మోపడంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని ఆక్వారైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
శ్రీ పెరుగుతున్న మేత ధరలు
సాధారణంగా రొయ్యలకు ఎక్కువ ప్రొటీన్లు, మినరల్స్‌ ఉన్న మేతను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వీటిని థాయిలాండ్‌, వియత్నాం, తైవాన్‌ దేశాలు అందించే సాంకేతికత ఆధారంగా పలు కంపెనీలు రాష్ట్రంలో తయారు చేస్తున్నాయి. 25 కిలోల బస్తాకు గతంకన్నా ప్రస్తుతం రూ.30 నుంచి రూ.60 వరకు ధర పెంచాయి. దీంతో టన్ను మేతకు రూ.2వేల రూ.2,500 వరకు ఆర్థిక భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఆక్వా సాగుదారులపై రాష్ట్ర ప్రభుత్వం అనధికారిక విద్యుత్‌ ఛార్జీల వసూళ్లకు పాల్పడటంతో మరింత వ్యయప్రయాసగా మారుతోందంటున్నారు.
శ్రీ చుట్టుముడుతున్న వ్యాధులు
ఆక్వాను పలు రకాల వ్యాధులు చుట్టఉముడుతున్నాయి. దీంతో చెరువుల్లో రొయ్య పిల్లలు వేసిన కొద్ది రోజుల్లోనే వ్యాధుల బారినపడి చెరువులు ఖాళీ చేయాల్సి వస్తోంది. ఒకదాని తరువాత మరో వ్యాధి వ్యాప్తి చెందడంతో రైతులు నష్టపోతున్నారు. ఆక్వా సాగంటేనే హడలిపోతున్నామని చెబుతున్నారు. దానికి తోడు 100 కౌంట్‌ రొయ్యల ధర రూ.240 పలికితే పెట్టుబడి వస్తుందని, ప్రస్తుతం రూ.190, రూ.200 మధ్య దోబూచులాడుతుండటంతో రైతులు ఆందోళనతో చెరువులలో నీరు బయటకు తోడేస్తున్నారు. దీనికి తోడు వర్షాకాలం కావడం సాగుకు అనుకూలమైన కాలం కాకపోవడంతో రిస్క్‌ చెయ్యడానికి భయపడుతున్నారు
శ్రీ వ్యాధులకు కారణాలివే..
రొయ్యల చెరువుల్లో స్థాయికి మించి సీడు(పిల్లల్ని) వేయడం, వాటి నిర్వహణ సరిగా లేకపోవడం, పిల్లల ఎంపికలో నాణ్యతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించకపోవడం, గత పంట సాగు అనంతరం నీటిని మార్చకుండా అందులోనే మళ్లీ సీడ్‌ వేయడం వంటి కారణాలతో వైట్‌స్పాట్‌ వ్యాధి ప్రబలుతోంది. ఒక చెరువులో ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా సమీపంలోని అన్నింటికీ వ్యాపిస్తుంది. చెరువులో సీడ్‌ వేసిన 30 నుంచి 45 రోజులకే వైట్‌స్పాట్‌ సోకడంతో రైతులు నష్టాల బారినపడుతున్నారు. ఇవి కాకుండా రెడ్‌గిల్‌, వైట్‌కట్‌ వంటివీ మరింత కలవరపెడుతున్నాయి.
శ్రీ అధిక ఖర్చుతో దిగులు...!
డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల ఎకరాల్లో అధికారికంగా ఆక్వా సాగవుతోంది. అనధికారికంగా మరో 15 వేల ఎకరాల్లో సాగు ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు వ్యాధుల కారణంగా సుమారు సగం వరకు చెరువులు ఖాళీ అయ్యాయి. కొత్తగా సాగులోకి వస్తున్నవారు ఒక పంటతోనే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. గతంలో ఎక్కడ ఖాళీ చెరువు కనిపించినా కౌలు రైతులు లీజుకు తీసుకునేందుకు యజమానుల వెంటపడేవారు. దీంతో లీజులకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు, విద్యుత్‌ ఛార్జీలు, మేత.. ఇలా ఒకటేమిటి అన్నింటి ఖర్చులూ పెరిగిపోవడంతో ఆక్వా సాగువైపు చూసేవారే కరవవుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా చెరువులు ఖాళీగానే కనిపిస్తున్నాయి. యజమానులు సాగుదారులను బతిమాలి మరీ చెరువులు అప్పగించే పరిస్థితి వచ్చింది.