Oct 30,2023 01:24

సమావేశంలో మాట్లాడుతున్న సిడబ్ల్యూసి సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : దేశంలో ఒబిసి జనగణనకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి చెప్పారు. ఓబీసీ జనగణ కార్యచరణపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఒబిసి రాష్ట్ర ముఖ్య నాయకులతో గుంటూరులోని ఏటూకూరు రోడ్డులోని వివాహ కన్వెన్షన్‌ హాలులో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కుల ప్రాతిపదికన జన గణన చేయాలనే ఆయా సంఘాల డిమాండ్‌ను కాంగ్రెస్‌ నాయకత్వం ఆమోదించిందన్నారు. ప్రతి మూడేళ్లకోసారి జరిగే కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో సామాజిక ఆర్థిక న్యాయాలపై చర్చ జరుగుతుందని, గతంలో జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల లెక్కలు తేలాలని తీర్మానించామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో త్వరలోనే అధికారంలోకి రాబోతుందని, కచ్చితంగా బీసీ కులాల గణన చేసి దేశ రాజకీయాల్లో ప్రత్యేక చోటు కల్పిస్తామని అన్నారు. దేశాభివద్ధి కోసం కాంగ్రెస్‌ పోరాటం చేస్తూ దేశాన్ని నిర్మిస్తుంటే బిజెపి మాత్రం దేశాన్ని మత ప్రాతిపదికన ద్వేషాలు పెంచుతోందన్నారు. ప్రశ్నించిన వారిపై సిబిఐ, ఈడిలతో భయపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ బిసి సెల్‌ జాతీయ అధ్యక్షులు అజరు సింగ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఒబిసి జనగణన అమలుకు చర్యలు ప్రారంభమయ్యాయని, మిగతా రాష్ట్రాల్లోనూ చేసేలా ఒత్తిడి తెస్తామని అన్నారు. అనంతరం కేంద్ర మాజీమంత్రి జెడి శీలం, పిసిపి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, వర్కిరగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, జిల్లా అధ్యక్షులు ఎల్‌.ఈశ్వరరావు మాట్లాడారు. బిసి జనగణనకు కాంగ్రెస్‌ అంగీకరించడంపై బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు ఆధ్వర్యంలో పలు బిసి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రఘువీరారెడ్డి, అజరుసింగ్‌ను సన్మానించారు.