Aug 29,2023 20:54

గ్రామ సచివాలయం దగ్గరే పగలే వెలుగుతున్న వీధి దీపం

ఓ వైపు విద్యుత్‌ కోతలు.. మరోవైపు వృధా..
- పల్లెల్లో పగలే వెలుగుతున్న వీధి దీపాలు
- పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌

      గ్రామాల్లో ప్రస్తుతం విద్యుత్‌ కోతలు ఎడా పెడా విధిస్తున్నారు. అయితే అదే గ్రామాల్లో వీధి దీపాలు మాత్రం పట్ట పగలూ కూడా వెలుగుతున్నాయి. నంద్యాల మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో విద్యుత్‌ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పగలంతా వీధి దీపాలు వెలుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి శాఖకు ఒక సిబ్బందిని నియమించారు. విద్యుత్‌ శాఖకు కూడా గ్రామంలో ఒకరిని లైన్‌మెన్‌గా ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్‌ అంతరాయాలు కలుగకుండా, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విద్యుత్‌ వృధా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లైన్‌మెన్‌దే. కానీ విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టపగలే విద్యుత్‌ దీపాలు వెలుగుతూ వందలాది యూనిట్ల విద్యుత్తు వృధా అవుతుంది. గ్రామ పంచాయతీలు విద్యుత్‌ సంస్థలకు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వృధా అవుతున్న విద్యుత్‌ భారాన్ని వివిధ రూపాలలో ప్రజలపై భారం మోపి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నంద్యాల మండలంలోని పులిమద్ది, కొత్తపల్లి, కానాల, పోలూరు, రాయమల్పురం, అయ్యలూరు, మిట్నాల, పుసులూరు గ్రామాలలో పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. దీనివలన వందలాది యూనిట్ల విద్యుత్తు వృధా అయి గ్రామపంచాయతీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రత్యేక లైన్లు ఆన్‌ ఆఫ్‌ స్విచ్లను ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం నిరంతరం విద్యుత్తును అందించడానికి వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా విద్యుత్‌ను ఆదా చేయాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఆదాయం, జనాభా మేరకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయగా రాత్రిపూట ఆన్‌ చేసి ఉదయం పూట ఆఫ్‌ చేయాలి. కానీ అలా జరగడం లేదు. దీంతో గ్రామపంచాయతీలకు వేలాది రూపాయలు బిల్లులు వస్తున్నాయి. ఇప్పటికైనా విద్యుత్‌ ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి ఆన్‌, ఆఫ్‌ స్విచ్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ వృధా కాకుండా పొదుపు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.