Aug 01,2021 20:15
  • రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి వెల్లడి
  • వలస కార్మికులు, గ్రామీణ పేదలపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ సమయాన కనీసం 'కరువు పని' (ఉపాధి హామీ) అయినా దొరక్కపోతుందా? అని ఎదురుచూస్తున్న గ్రామీణ పేదలకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం' పరిధిలో పనిదినాల పెంపు లేదని రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ప్రకటించారు. పట్టణాలు, నగరాల్లో ఇటీవల ఉపాధి కోల్పోయిన కోట్లాదిమంది వలస కార్మికులు, గ్రామీణ పేదలు తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. లాక్‌డౌన్‌ దెబ్బకు ఎక్కడా పని దొరికే పరిస్థితి లేదు. కనీసం ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనులు చూపుతారని ఎంతోమంది గ్రామీణ పేదలు ఎదురుచూస్తున్నారు. కేంద్రం తాజా ప్రకటన వారిని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది.

ఉపాధి హామీ అమలుకు సంబంధించి కేంద్రం మరో బాంబులాంటి వార్త పేల్చింది. పని దినాల సంఖ్య పెంచాలనుకుంటే... దానికయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన చోట, ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో లబ్ధిదారులైన కుటుంబానికి అదనంగా మరో 50 రోజులు పని కల్పించాలి. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ, సంక్షేమ మంత్రుల ప్రతిపాదనలు పంపాక అదనపు పనుల కల్పన జరగాల్సి వుంటుంది. దీనికి సంబంధించి కూడా కేంద్రం అనూహ్యమైన ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడా కూడా ఉపాధి హామీ కింద పని దినాల సంఖ్య పెంచే ఆలోచన లేదని సాధ్వి నిరంజన్‌ జ్యోతి తేల్చి చెప్పారు.

వారి సంఖ్య పెరిగింది : కేంద్రం
రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సాధ్వి నిరంజన్‌ జ్యోతి 'ఉపాధి హామీ' పథకం అమలుపై కొన్ని గణాంకాలు విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3,91,112 కుటుంబాలకు ఉపాధిహామీ కింద వంద రోజులపాటు పని కల్పించారు. ఏడాది తొలి త్రైమాసికమైన ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలోనే వీరికి వంద రోజులపాటు పని దొరికింది. గత ఏడాదితో (3,18,532 కుటుంబాలకు వంద పని దినాలు) పోల్చితే.. ఈ ఏడాదిలో లబ్ధిపొందిన కుటుంబాల్లో పెరుగుదల 23శాతంగా ఉంది.

అమలు అంతంత మాత్రమే
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీా2005' చట్టం కింద గ్రామాల్లో ఉపాధి కోరుకునే ప్రతి ఒక్కరికీ కనీసం వంద రోజులపాటు ప్రభుత్వమే పని చూపాలి. కేంద్రంలో మోడీ సర్కార్‌ వచ్చాక, చట్టం అమలు మెల్లమెల్లగా నీరుగారిపోతోంది. ప్రతి ఏటా నిధుల కేటాయింపు బడ్జెట్‌లో చూపుతున్నా, క్షేత్రస్థాయిలో అమలు అంతంతమాత్రమే. కరోనా మొదటివేవ్‌ అనంతరం గ్రామీణ పేదల్ని ఉపాధి పనులు ఆదుకున్నాయని, వారి చేతుల్లోకి ఎంతో కొంత నగదు చేరిందని అనేక సర్వేలు చెబుతున్నాయి. పథకం అమలు విస్తరించాలని, పనిదినాల సంఖ్య పెంచాలని ప్రతిపక్షాలు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు సైతం సూచిస్తున్నారు.