Jul 31,2021 16:49

టోక్యో : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పోరులోను వరల్డ్‌ నెంబర్‌ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు చుక్కెదురైంది. 77వ ర్యాంకర్‌, స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ పాబ్లో క్యారెనో బుస్టా చేతిలో ఈ సెర్బియన్‌ ఆటగాడు చిత్తయ్యాడు. శనివారం జరిగిన బ్రాంజ్‌ మెడల్‌ ఫైట్‌లో పాబ్లో క్యారెనో 6-4, 6-7, 6-3 తేడాతో జొకోవిచ్‌ను ఓడించాడు. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ప్లేయర్‌తో ఆడుతున్నాననే బెరుకు లేకుండా ఆధిపత్యం చెలాయించాడు. జొకోవిచ్‌ గట్టి పోటీ ఎదురైనప్పటికీ బుస్టా తనదైన శైలిలో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో ఇద్దరు నువ్వా నేను అన్నట్లు తలపడగా టై బ్రేక్‌ దారితీసింది. కానీ అనుభవన్నంతా ఉపయోగించిన జొకో రెండో సెట్‌ను ఖాయం చేసుకున్నాడు. దీంతో నిర్ణయాక మూడో సెట్‌ ఆడాల్సి వచ్చింది. ఇక ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన బుస్టో జోరు కనబరుస్తూ మూడో సెట్‌ను 6-3తో ముగించి సెట్‌తో పాటు బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు.

కాగా, ఈ ఏడాది టెన్నిస్‌లో గోల్డెన్‌ స్లామ్‌ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశించిన జొకోవిచ్‌కు సెమీస్‌లో అలెగ్జాండర్‌ షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో జొకో 6-1, 3-6, 1-6 తేడాతో జ్వెరవ్‌ (జర్మనీ) చేతిలో ఖంగుతిన్నాడు. దీంతో ఈ ఏడాది గోల్డెన్‌ స్లామ్‌ సాధించాలనే అతడి కల.. కలగానే మిగిలిపోయింది. తాజాగా పాబ్లో క్యారెనో బుస్టా చేతిలో ఓడిపోవడంతో కనీసం కాంస్యం కూడా గెలవలేకపోయాడు. దీంతో జకోవిచ్‌కు టోక్యో ఒలింపిక్స్‌ ఓ చేదు అనుభవంలా మిగిలిపోయింది. పతకం ఏమీ లేకుండానే ఈ ప్రపంచ నెంబర్‌ వన్‌ ప్లేయర్‌ ఇంటిముఖం పట్టాడు.