
* నిర్ణయం తీసుకున్న తరువాత అభిప్రాయాలేమిటి ? పిడిఎఫ్ నిరసన
ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో : ప్రమాణాలను పెంచేందుకే విద్యారంగంలో సంస్కరణలను తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారంనాడు సచివాలయంలో జాతీయ విద్యా విధానం 2020 ముసాయిదాపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గన్న మంత్రి మాట్లాడుతూ విద్యా విధానంపై ఎటువంటి విధాన నిర్ణయం జరగకముందే దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం 2020లోని చాలా అంశాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ అంగన్‌వాడీలలో ప్రీప్రైమరి1, ప్రీప్రైమరి2, ప్రాథమికపాఠశాలలోని 1,2 తరగతులతో ఫౌండేషన్ స్కూల్స్‌ను, 3వతరగతి నుండి ఇంటర్మిడియట్ వరకు ఉన్నత పాఠశాలలు వుంటాయన్నారు. ఈ విధానంను 2023ా24 విద్యా సంవత్సరంనుండి ఈ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందన్నారు. అప్పటిదాకా ఆరు రకాలుగా పాఠశాలల విలీన ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. చివరికి రాష్ట్ర విద్యావిధానంలో ఫౌండేషన్ స్కూల్స్, హైస్కూల్ ఈ రెండే వుంటాయని అన్నారు. జూనియర్ కాలేజీలు లేని మండలాల్లో హైస్కూల్ ప్లస్‌లు వుంటాయని అన్నారు. అనంతరం మాట్లాడిన పిడిఎఫ్ ఎంఎల్‌సిలు ప్రభుత్వ ఏకపక్ష తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాలు ముందుగానే తీసుకుని ఇప్పుడు అభిప్రాయాలు అడగటమేమిటని ప్రశ్నించారు. శాసనమండలి ఛైర్మన్ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఇప్పటికే డిఇఓలు, ఆర్‌జెడిలతో సమావేలు జరిపి నిర్ణయాలు తీసుకుని పిల్లలకు టీసిలు ఇచ్చే దశలో తమతో అభిప్రాయాలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. నూతన విద్యా విధానం విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయిలో ఉపాద్యాయులు సహకారం అందిస్తేనే సాద్యం అవుతుందని అన్నారు. ఈ సందర్బంగా కెఎస్ లక్ష్మణ్‌రావు, వై శ్రీనివాసులరెడ్డి, ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ, కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ తదితరులు మాట్లాడుతూ ఆరు నుండి 10 ఏళ్ల వయస్సులోని పిల్లల మానసిక స్థితి, అభ్యసన సామర్థ్యం, మానసిక స్థితి ఒకే స్థాయిలో వుంటుందని వారిని విడదీయడం మంచిది కాదని చెప్పారు.
ఎమ్మెల్సీలలకు వినతులు ఇస్తే చార్జ్ మెమోలా? సెక్రటరీ, కమిషనర్ తీరుపై పిడిఎఫ్ ఎమ్మెల్సీల ఆగ్రహం
సమావేశం ప్రారంభానికి ముందు విద్యాశాఖలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై పిడిఎఫ్ ఎంఎల్‌సిలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎంఎల్‌సిలకు సమస్యలపై వినతిపత్రాలిస్తే వారికి ఛార్జ్ మెమోలు ఇస్తున్నారని ఇదెక్కడి పద్దతని ప్రశ్నించారు. విద్యాశాఖ కమిషనర్, కార్యదర్శి ఉపాధ్యాయ సంఘాలపై అప్రకటిత నిషేదం విధించినట్టుగా వ్యవహరిస్తున్నారని, శాసనమండలి సభ్యులను కూడా ఖాతరు చేయడం లేదని అన్నారు. శాసనమండలి ఛైర్మన్ విఠు బాలసుబ్రహ్యణ్యం మాట్లాడుతూ విద్యాశాఖలో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని చెప్పారు. కెఎస్ లక్ష్మణ్‌రావు మండిపడ్డారు. సంఘం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దాన్ని నియంత్రించాలను కోవడం సరైందికాదన్నారు. వినతులను తీసుకొని 300,400కిలోమీటర్ల దూరం నుండి వస్తే కమిషనర్, కార్యదర్శి బాద్యతారహితంగావ్యహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కోవిడ్‌తో 856మంది ఉపాద్యాయులు చనిపోతే విద్యాశాఖలో రిపోర్ట్ లేకపోవడం బాద్యతారాహిత్యం కాదా అని ఎమ్మెల్సీ షేక్ సాబ్జి విమర్శించారు. తనద్వారా వినతిపత్రం పంపిన ఒక టీచర్‌కు చార్జ్ మెమో ఇచ్చారని ఎంఎల్‌సి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో డిఇఓ పోస్ట్‌కు సీనియర్‌ను కాదని జూనియర్‌కు ఇవ్వడం బాద్యతా రాహిత్యమని ఎమ్మెల్సీ వై శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఉన్నతాధికులు తమ పద్దతులు మార్చుకోవాలని మరో ఎంఎల్‌సి పాకలపాటి రఘువర్మ అన్నారు. ఇప్పటికైనా ఈ తరహా పద్దతులు మానుకోవాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి, మంత్రులే బాధ్యత వహించాలని ఎంఎల్‌సిలు హెచ్చరించారు. అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఇకపై ఇలాంటివి జరకుండా చూస్తామని హామీ ఇచ్చారు.