Nov 05,2023 08:12

ఖాట్మాండ్‌ :    నేపాల్‌లో భూకంప మృతుల సంఖ్య 132కి చేరింది. సుమారు 140 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. శుక్రవారం అర్థరాత్రి 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

శుక్రవారం అర్థరాత్రి భూకంపం రావడంతో జాజర్‌కోట్‌లోని పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి. అర్థరాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని పోలీస్‌ అధికారి తెలిపారు. భయాందోళనలతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారని అన్నారు. మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహాల్‌ సంతాపం ప్రకటించారు. వైద్య బృందంతో కలిసి భూకంప ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. సహాయక చర్యల కోసం సైన్యాన్ని మోహరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హెలికాఫ్టర్‌లను సిద్ధం చేసినట్లు తెలిపింది.