
టోక్యో : గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతో శనివారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని ఒలింపిక్స్ అథ్లెట్, గోల్డ్‌మెడలిస్ట్ నీరజ్ చోప్రా అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్వీడన్ నుండి టోక్యో చేరుకున్న రెండు రోజులు టైమ్‌లో భారీగా మార్పులు ఉండటంతో సరిగా నిద్రపోలేకపోయానని అన్నారు. పతకం గెలుచుకున్న తర్వాత గోల్డ్‌మెడల్‌ను నా దిండు పక్కనే పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయానని అన్నారు. ఒలింపిక్స్ సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ట్రాక్‌గా స్టేడియంలో వినిపించడం ఇదే మొదటిసారి. పోడియం పై నుండి జాతీయ గీతాన్ని వినడం సంతోషం కలిగించిందని, మాటల్లో చెప్పలేనని అన్నారు. మొదటి, రెండు త్రోలతో తాను మెడల్ గెలుచుకోగలనని నమ్మకం కలిగిందని, అయితే తాను స్వర్ణం గెలుచుకోవాలనుకున్నానని, అందుకు వందశాతం శ్రమించానని అన్నారు. కాగా, శనివారం ఒలింపిక్స్ పురుషుల జావెలిన్‌త్రోలో తన అద్వితీయమైన ప్రదర్శనతో నీరజ్‌చోప్రా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. దశాబ్దం అనంతరం భారత్‌కు మరోసారి గోల్డ్‌మెడల్‌ను అందించడమే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో రెండవ వ్యక్తిగా నిలిచారు.