Aug 17,2023 20:27

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి రూ.14,000 కోట్లు ఎగ్గొట్టిన నయవంచకుడు చంద్రబాబు అని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. గురువారం నియోజకవర్గస్థాయి వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ లబ్ధిదారులతో స్థానిక మదర్‌వన్నిని ఆసుపత్రి ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలను నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారని తెలిపారు. హామీ ఇవ్వకపోయినా సున్నా వడ్డీ కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. 2019 ఏప్రిల్‌ 11 నాటికి ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీచేసి నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మూడు విడతలు దిగ్విజయంగా అమలు చేశారన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి కొట్టు సత్యనారాయణ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధికార ప్రతినిధి కొలుకులూరి ధర్మరాజు, పట్టణ అధ్యక్షులు జి.నాగు, పెంటపాడు ఎంపిపి దాసరి హైమావతి పాల్గొన్నారు.