Oct 05,2023 20:52

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ 'న్యూస్‌ క్లిక్‌'పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నరసరావుపేట ప్రెస్‌క్లబ్‌ ఖండించింది. ఈ మేరకు విలేకర్లు పట్టణంలో గురువారం నిరసన ప్రదర్శన చేశారు. ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఆర్‌డిఒ ఎం.శేషిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమానికి పి.బుజ్జిబాబు అధ్యక్షత వహించగా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు సిహెచ్‌ రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు బి.ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడారు. ప్రభుత్వానికి నచ్చని వార్తలను వేస్తున్నందుకు ప్రబీర్‌ పుర్కాయస్థ నేతత్వంలో నడుస్తున్న న్యూస్‌క్లిక్‌పై ఉపా చట్టం కింద కేసులు పెట్టడం కుట్రపూరితమనిమన్నారు. మోడీ నిరంకుశ విధానాలు, మీడియాపై దాడులతో దేశం ఇప్పటికే దేశంలో ప్రపంచ పత్రికా స్వాతంత్య్రంలో అట్టడుగు స్థాయికి చేరిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్‌.జగన్మోహన్‌రెడ్డి, ఎస్‌.లక్ష్మయ్య, బి.శివ, ఎన్‌.సుధీర్‌బాబు జి.శ్రీనివాసరెడ్డి, ఎన్‌.కృష్ణ, జి.ప్రేమసాగర్‌, సాంబశివరావు, శ్రీనివాస్‌, ఆలీ, శ్రీనివాస్‌, కె.రమేష్‌ పాల్గొన్నారు.