
'న్యూస్ క్లిక్' ప్రతినిధుల అరెస్టు సరైంది కాదు
- మీడియాపై కేంద్ర నిర్భంధం ఆపాలి
- మీడియా స్వేచ్ఛను హరిస్తే భారీ మూల్యం తప్పదు
- సిఐటియు, ఎపిడబ్ల్యుజెఎఫ్ నేతలు హెచ్చరిక
ప్రజాశక్తి - నంద్యాల రూరల్
న్యూస్ క్లిక్ మీడియా ప్రతినిధుల అరెస్టు సరైంది కాదని, మీడియాపై కేంద్రం నిర్బంధం ఆపాలని, మీడియా స్వేచ్ఛను హరించాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు, ఎపిడబ్ల్యూజెఎఫ్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీడియాపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జరుపుతున్న దాడులకు నిరసిస్తూ మంగళవారం నంద్యాల పట్టణంలోని నూనెపల్లె-కోవెలకుంట్ల జంక్షన్‌లో జీవోని దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు డి.లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.నాగరాజు, అధ్యక్షులు వి.యేసురత్నం, ఎపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ సభ్యులు మౌలాలి మాట్లాడారు. న్యూస్ క్లిక్ వెబ్ ఛానల్ యాజమాన్యాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా, రైతాంగ సమస్యలను ఎత్తిచూపుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ స్వేచ్ఛగా వార్తలను ప్రచారం చేస్తున్న న్యూస్ క్లిక్ ఎఫ్ ఛానల్‌పై ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆఫీసులపై ఐటి దాడులు నిర్వహించి యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదన్నారు. ప్రబీర్ పురకాయస్త, అడ్మినిస్ట్రేట్ మేనేజర్ అభిజిత్ చక్రవర్తిలను మానసికంగా వేధించడం యావత్ భారతదేశం గమనిస్తుందని, మీడియా రంగంపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితువు పలికారు. కేంద్రానికి అనుకూలంగా లేని పత్రికలపై, యాజమాన్యాలపై కక్ష సాధింపు ధోరణికి పాల్పడటం మోడీ ప్రభుత్వానికి తగదన్నారు. ఇలాంటి చర్యలతో పాల్పడితే భవిష్యత్తులో ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. న్యూస్‌క్లిక్ ప్రతినిధులు, 16 మంది పాత్రికేయులపై ఉపా చట్టం కింద కేసులు బనాయించారని, ఇది తీవ్ర అన్యాయమన్నారు. దేశంలో మీడియా స్వేచ్ఛ మరింత దిగజారిందన్నారు. 180 దేశాలలో భారతదేశం మీడియా స్వేచ్ఛలో 161 స్థానంలో ఉందన్నారు. వీరు చేసిన నేరమంతా గత సంవత్సరం జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రపంచానికి తెలియజేయడమేనని అన్నారు. గతంలో మీడియా స్వేచ్ఛను హరించిన పార్టీలకు, రాజకీయ నాయకులకు ఎంతోమందికి ప్రజలు బుద్ధి చెప్పారని, ఇదేవిధంగా న్యూస్‌క్లిక్‌పై ఆగడాలను ఆపకపోతే ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి కె.మహమ్మద్ గౌస్, కోశాధికారి వెంకట లింగం, ఎపిడబ్ల్యూజెఎఫ్ పట్టణ కార్యదర్శి జగన్ మోహన్ ఉపాధ్యక్షులు జాషువ, సహాయ కార్యదర్శి ఇక్బాల్, నాయకులు శ్రీనివాస్, రాజేష్, హరీష్, జర్నలిస్టులు పాల్గొన్నారు.