Nov 13,2022 00:28

న్యుమోనియా పట్ల అవగాహన కల్పిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-ఆనందపురం : ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమైన న్యుమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ షేక్‌ షాహనాజ్‌ సాది సూచించారు. న్యుమోనియా దినోత్సవం సందర్భంగా గంభీరం సచివాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, న్యుమోనియా ఒక ప్రమాధకర వ్యాధి అన్నారు. ఐదేళ్ల లోపు పిల్లల మరణాలకు అతి ముఖ్యమైన కారణం న్యుమోనియా అని తెలిపారు. న్యుమోనియా లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని చెప్పారు. జలుబు ఎక్కువగా ఉండటం, ఎక్కువసార్లు వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునే సమయంలో డొక్కలు ఎగరవేయడం, నీరు తాగలేకపోవడం, శ్వాస తీసుకునే సమయంలో గురక రావడం, నీరసంగా మత్తుగా ఉండడం న్యుమోనియా లక్షణాలు అని పేర్కొన్నారు. దీని నుంచి రక్షణకు సమయానుసారంగా టీకాలు వేయించాలని చెప్పారు. తాగునీటి పాత్రలపై మూతలు పెట్టాలని, బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేతులు శుభ్రపరుచుకోవాలని, రాత్రి వేళలో పిల్లలకు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి, ఆరోగ్యపర్యవేక్షకులు పి.సన్యాసిరావు, ఆరోగ్య కార్యకర్తలు సత్యవతి, అప్పలరాజు, గంగాదేవి, సిహెచ్‌ఒ సాయిగౌతమి, ఆశా కార్యకర్త వరలక్ష్మి పాల్గొన్నారు.