Nov 16,2023 21:53

పిల్లల తల్లులకు సూచనలు ఇస్తున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

ప్రజాశక్తి - బెలగాం : పిల్లల్లో న్యుమోనియా లక్షణాలను గుర్తించి, నివారణా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు సూచించారు. ఈ మేరకు 14వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన న్యుమోనియా తదితర శ్వాస సంబంధమైన వ్యాధుల నియంత్రణకు సంబంధించిన సాన్స్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్నాథరావు మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లల్లో సంభవించే ప్రాణాంతకమైన వ్యాధుల్లో న్యుమోనియా తీవ్రమైందని, వ్యాధి లక్షణాల్లో ముఖ్యంగా జలుబు, దగ్గు అధికంగా ఉండి త్వర-త్వరగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు పక్కటెముకులు కదలడం, అధికంగా జ్వరం రావడం, శ్వాస తీసుకునే సమయంలో శబ్దం రావడం, ఏమీ తినకపోవడం, తాగకపోవడం, అధికంగా నిద్రపోవడం మొదలగు లక్షణాల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. వాతావరణంలో మార్పులు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడం, పౌష్టికాహారం సరిగా తీసుకోని పిల్లల్లో న్యుమోనియా అధికమవుతుందన్నారు. న్యుమోనియా నుండి సురక్షితంగా ఉండాలంటే బిడ్డ శరీరాన్ని బట్టలతో పూర్తిగా కప్పి ఉంచాలని, ఇంటిలో పొగ లేకుండా చూసుకోవడం, కిటికీలు తెరచి ఉంచడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోనే ముర్రుపాలు పట్టించాలని, మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలన్నారు. వైద్య, ఐసిడిఎస్‌ సిబ్బంది సమన్వయంతో పని చేసి పిల్లల్లో న్యుమోనియా నివారణ చర్యలు చేపట్టి ఆరోగ్యవంతమైన బాల్యాన్ని వారికి అందేయాలని ఆయన కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు మాట్లాడుతూ పిసివి వ్యాక్సిన్‌ న్యుమోనియా నివారణలో కీలకమైనదని, ఖచ్చితంగా పీసివి టీకా మూడు డోసులు పిల్లలకు 6 వారాలు,14 వారాలు,9 నెలల వయస్సులో వేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పుష్ప, జయగౌడ్‌, ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ రమాదేవి, వైద్య సిబ్బంది, అంగన్వాడీ , ఆశా కార్యకర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.