Jun 13,2021 12:17

క్రీడారంగానికి ఓ సవాల్‌ ! గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ నుంచి ప్రపంచ నంబర్‌ టూ నయోమి ఒసాకా, వైదొలిగింది. దీంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఉన్నతాధికారుల మధ్య వివాదం తలెత్తింది. ఈ మొత్తం విషయం టెన్నిస్‌, మీడియా పాత్ర గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న ఆందోళనలను మరోసారి హైలైట్‌ చేసింది. దీంతో ప్రెస్‌ సమావేశాలు తప్పనిసరిగా కొనసాగాలా? అనే దానిపై చర్చ మొదలైంది. అయితే క్రీడాకారులకు ఈ రంగంలో తమ ఆట కన్నా వారి వ్యక్తిగత రాగద్వేషాలకు, మీడియాతో మాట్లాడటానికి, వారి పబ్లిసిటీకి, ఇమేజ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది పెద్ద విమర్శ. ఒకవేళ క్రీడాకారుల్లో ఎవరైన అసలు మాటలురాని వారు ఉంటే అప్పుడేం చేస్తారు? అనేదీ ప్రశ్నే. అలాగే మానసిక అనారోగ్యంపై ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంది. అసలు ఆమె ఇంటర్నేషనల్‌ మీడియాతో మాట్లాడకపోతే పోయేదేముంది ? మానసిక అనారోగ్యం పట్ల, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిపట్ల ప్రపంచం ఎంత కఠినంగా ఉందో ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.

   వాస్తవానికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభానికి ముందే ఒసాకి, తాను మీడియా సమావేశాలకు హాజరుకానని స్పష్టం చేసింది. 'మీడియా సమావేశం ఆసక్తికరంగా, ఆటగాళ్లల్లో ఉత్సాహాన్ని నింపేలా సాగాలి. కానీ మీడియా నన్ను బాధపెట్టే ప్రశ్నలు వేస్తూ, నన్ను మానసికంగా కృంగదీస్తోంది. అందుకే నా మానసిక ఆరోగ్యం కోసం మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది నయోమి ఒసాకా. మొదటి రౌండ్‌లో సునాయాస విజయం సాధించినా, మీడియా సమావేశానికి హాజరుకాకపోవడంతో జరిమానా వేశారు. దీంతో ఆ తర్వాతి రోజు ఏకంగా ఆమె టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది.
   'నా కెరీర్‌లో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అయితే కొన్నాళ్లుగా మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. 2018 యూఎస్‌ ఓపెన్‌ నుంచి డిప్రెషన్‌లో ఉన్నా. నేను ఓ అంతర్ముఖురాలిని. ఎవరితోనూ అంత తేలికగా కలవలేను. నేను ఎప్పుడూ హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని ఉండడానికి కారణం ఇదే. సోషల్‌ యాంగ్జైటీ నుంచి బయటపడడానికి హెడ్‌ ఫోన్స్‌ను వాడుతున్నా. ప్రెస్‌ నాతో ఎప్పుడూ మంచిగానే ఉన్నారు. నాతో ఎంతో కూల్‌గా మాట్లాడిన కొందరు జర్నలిస్టులకు క్షమాపణలు కూడా చెప్పాలనుకుంటున్నా. నేను ఇప్పటికే పారిస్‌లో కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నా. అందుకే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ రూల్స్‌ సరైనవా? కావా? అని మాట్లాడే స్టేజ్‌లో నేను లేను. ఇప్పటికైతే కొన్నాళ్ల పాటు టెన్నిస్‌ కోర్టుకి దూరంగా ఉండాలని అనుకుంటున్నా. టెన్నిస్‌ ప్లేయర్లు సౌకర్యంగా ఫీల్‌ అయ్యేలా ఏం చేయాలో, ఎలా చేయాలనే దానిపై మాట్లాడాలనుకుంటున్నా, అయితే ఇక్కడ ఉన్న కొన్ని పాతకాలపు నిబంధనలను అందరి దృష్టికీ తీసుకురావాలని ప్రయత్నించా. నిర్వాహకులకు క్షమాపణ చెబుతూ టోర్నీ ముగిసిన తర్వాత మాట్లాడతానని కూడా విడిగా చెప్పా. ప్రస్తుతానికి మైదానం నుంచి విరామం తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఏమేం చేయవచ్చో నేనూ చర్చిస్తా' అంటూ సుదీర్ఘ లేఖను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది నయోమీ ఒసాకా.
   కోర్టుకు దూరంగా, పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా బ్లాక్‌ లైవ్స్‌ మాటర్స్‌ ఉద్యమంలో ఒసాకా ఒక ప్రముఖ స్వరం. జపనీస్‌ తల్లి, హైటియన్‌-అమెరికన్‌ తండ్రికి జన్మించింది ఆమె. ప్రస్తుతం యుఎస్‌లో తన జీవితమంతా దాదాపుగా జీవించింది. ఆమె గెలిచిన 2020 యుఎస్‌ ఓపెన్‌లో.. ఏడు మ్యాచ్‌లకు ఏడు ముసుగులు ధరించింది. నల్ల జాతీయులపై జరుగుతున్న అన్యాయాన్ని ముసుగులపై పేరుతో హైలైట్‌ చేసింది.
తన కెరీర్‌లో 23 ఏళ్ల ఒసాకా మొత్తం ఏడు సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించగా... అందులో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉండటం విశేషం. 2018లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఓడించి, యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఒసాకా 2019, 2021లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను... 2020లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఒసాకా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవడం దురదృష్టకరమని, వచ్చే ఏడాది ఆమె ఈ టోర్నీలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించిన ఫ్రెంచ్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ గైల్స్‌ మోరెటాన్‌... ఆటగాళ్ల ఆరోగ్యం, మంచీ చెడూ చూసుకునే బాధ్యతను తాము ఎప్పుడూ విస్మరించలేదని స్పష్టం చేశారు.
   అయితే గ్రాండ్‌స్లామ్‌ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు కచ్చితంగా మీడియా సమావేశానికి హాజరు కావాల్సిందే. ఊహించినట్లుగానే తొలి రౌండ్‌ విజయం తర్వాత ఒసాకా తన మాటపై నిలబడటంతో నిర్వాహకులు ఆమెపై 15 వేల డాలర్ల జరిమానానూ విధించారు. దీంతో పాటు అవసరమైతే గ్రాండ్‌స్లామ్స్‌లో ఆడకుండా నిషేధం కూడా విధిస్తామంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ నిర్వాహకులు హెచ్చరించారు. ఇలాంటి స్థితిలో టోర్నీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడమే సరైందిగా ఆమె భావించారు.
 

క్రీడాకారుల మద్దతు..
ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నయోమి ఒసాకాకు వరల్డ్‌ నంబర్‌ వన్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సెల్యూట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిర్ణయం ఎంతో సాహసోపేతమైందని కొనియాడారు. 'నయోమికి నా మద్దతు ఉంటుంది' ఆమె సాహసోపేత నిర్ణయం తీసుకొందని జొకోవిచ్‌ తెలిపారు.
   ఇక మరోవైపు ఎఫ్‌-1 వరల్డ్‌ చాంపి యన్‌ లూయిస్‌ హామిల్టన్‌ కూడా ఒసాకాకు అండగా నిలిచారు. 'ఒసాకా ఒంటరి కాదని.. ఎంతో మంది తన వెంట ఉన్నారన్న విశ్వాసం ఆమెలో కలిగించాలని' తన ఫాలోవర్లను కోరుతూ హామిల్టన్‌ ట్వీట్‌ చేశారు. ' ఆమెకు ఓ హగ్‌ ఇవ్వాలనుకుంటున్నా, ఇది ఎలాంటి పరిస్థితో నాకు తెలుసు. నేనూ గతంలో ఇలాంటివి ఎదుర్కొన్నా. అందరూ ఒకేలా స్పందించాలని లేదు. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్‌ చేస్తుందో అలాగే చేయనివ్వండి' అని అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌, ఎన్‌బీఏ స్టార్‌ కైరీ ఇర్విన్‌లు 'టెన్నిస్‌ క్వీన్‌ ఈ పరిస్థితుల్లో మేమంతా మీ వెంటే' అని ఒసాకాకు మద్దతుగా ట్వీట్‌లు చేశారు.