Apr 21,2023 00:24

గొడుగు నీడన సంతలో కూర్చున్న గిరిజనులు లమ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: మన్యం ప్రాంతంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈ ఏడాది మన్యంలోనూ ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. మైదాన ప్రాంతానికి పోటీగానే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గురువారం సైతం ఎండ ప్రతాపం చూపింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతోంది. నాలుగు గంటల వరకు వేడి ప్రభావం కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రతకు బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో గొడుగులు వేసుకుని బయటకు వెళుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ఏజెన్సీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఊహించని రీతిలో ఎండల తీవ్రత ఉండడంతో ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. సాయంత్రం 6 గంటలైనా వేడిగాలి వెంటాడుతూనే ఉంది. పిల్లలు, వృద్దులు అల్లాడిపోతున్నారు. గర్భిణులు, బాలింతలు ఎండల వేడిమికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. తప్ప లేని పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ మహమ్మారి బారిన పడే ప్రమాదం లేకపోలేదు. రక్షిత మంచినీరే కాదు తరచూ మజ్జిగ వంటివి క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు. ఎండలు తగ్గే వరకూ గిరినులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచింస్తున్నారు.