కోవిడ్ విజృంభణ సంక్షోభ పరిస్థితులపై సుమోటోగా విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం గత ఆదివారం రాత్రి ఒక అఫిడవిట్ సమర్పించింది. కోవిడ్ వ్యాక్సిన్ విధానాన్ని నిపుణుల సలహాల మేరకే రూపొందించామని ఇందులో ఇక న్యాయస్థానాల జోక్యం అవసరముండదని ఉద్ఘాటించింది. జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనానికి సమర్పించిన 218 పేజీల ప్రమాణ పత్రంలో వాస్తవ పరిస్థితులకు పూర్తి విరుద్ధమైన తప్పుడు సమాచారంతో అఫిడవిట్ నిండిపోయంది. నిత్యం లక్షల కేసులతో..వేలాది మంది మరణాలతో వాస్తవ పరిస్థితులు భయోత్పాతంగా ఉన్నా లెక్క చేయని ప్రభుత్వం కోవిడ్ నివారణకు మెరుగైన విధానం అమల్జేస్తున్నామని పేర్కొంది. సుప్రీంకోర్టు జోక్యం సదుద్దేశంతో చేసుకున్నదే అయినా...టీకాల విధానంలో అత్యుత్సాహంతో కోర్టులు జోక్యం చేసుకుంటే ఊహించని పరిణామాలు ఎదురుకావచ్చనని నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్నే బెదిరించే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారిపోయింది.
దేశవ్యాప్తంగా వైద్యం పడకేసి పడకలు దొరకక, ఆక్సిజన్ అందక, టీకాలకూ గతిలేక కనీస వైద్య సాయానికి దిక్కులేక అనునిత్యం లక్షలాది మంది కోవిడ్ బారినపడుతున్నారు. వేలాది మంది బలైపోతున్నారు. గాలిలో ప్రాణాలు గాల్లోనే కలుస్తున్నాయి. శ్మశానాల్లోనూ చోటు దక్కక వారణాసి సాక్షిగా గంగా నదీ జలాల్లో కలిసిపోతున్న బతుకులెన్నో! ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో దుస్థితి ఇంకెంతటి దారుణంగా ఉంటుందో ఊహించవచ్చు.
మే నెలాఖరు నాటికి కూడా తమ కోటా ప్రకారం అందాల్సిన టీకాలు అందే పరిస్థితి లేదని దేశంలో ఒకటింట మూడో వంతు రాష్ట్రాలు (మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కేరళ, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, మణిపూర్) సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఏకరువు పెట్టాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఏమీ లేదు. కాకపోతే రాజకీయ సమీకరణలు, ఆయా రాష్ట్రాల పాలకాధీశుల స్వప్రయోజనాల కారణంగా మోడీ సర్కార్ అడుగులో అడుగేస్తున్నాయంతే. ఊహించనిరీతిలో మానవత్వ సంక్షోభం దేశంలో నెలకొందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదివరకే తీవ్రంగా వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానపర వైఫల్యాలను వివిధ హైకోర్టులు కూడా తీవ్రస్థాయిలో ఎండగట్టాయి. కోవిడ్ రెండో దశలో భారత్ అంతులేని సంక్షోభంలో కూరుకుపోయిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆగ్రహంతో సంపాదకీయాలు రాశాయి. ఈ సంక్షోభానికి చలించి ప్రపంచ దేశాలు సహాయ హస్తం అందించాయి. ఇంత జరుగుతున్నా మోడీ సర్కార్ మాత్రం తన మొద్దు నిద్ర వీడట్లేదు. ఈ పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి ఆక్సిజన్ సరఫరాకు ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్ కూడా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో న్యాయవ్యవస్థ జోక్యాన్ని ప్రశ్నిస్తూ మోడీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది.
వాస్తవానికి కార్యనిర్వాహక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం ఎప్పుడూ చర్చనీయాంశమే. రాజ్యాంగ మూలసూత్రాలకు విరుద్ధంగా ఉండే శాసన చట్టాలను, కార్యనిర్వాహక వ్యవస్థ విధానాలను సమీక్షించే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంది. ఇప్పుడు మోడీ సర్కార్ తన అఫిడవిట్ ద్వారా సవాలు చేస్తున్నది సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న ఈ హక్కునే.
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) విషయంలోనూ, దేశానికి వెన్నెముక లాంటి రైతన్నల వెన్ను విరుస్తూ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, శ్రమజీవుల హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన కార్మిక కోడ్‌ల విషయంలో హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయాల్లో కేంద్రం తీరును సమర్థిస్తూనే కాలం వెళ్లబుచ్చింది. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు హక్కులనే ప్రశ్నించే స్థితికి మోడీ సర్కార్ తెగబడింది.
యంత్రం పని చేయాలంటే కీళ్లు కదిలే అవకాశమివ్వాలి అందులో సందేహం అక్కరర్లేదు. కానీ ఆ యంత్రం పని చేసేదిగా ఉన్నప్పుడే ఆ అవకాశానికి వీలుంటుంది. కానీ ఇక్కడ యంత్రం మూలనపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని పాలనాయంత్రాంగం మొత్తం పడకేసింది. 'ఏడేళ్ల వయస్సున్న ఎన్‌డిఎ ప్రభుత్వం కనిపించడం లేదు' అంటూ ఔట్‌లుక్ లాంటి ప్రముఖ వార్తా సంస్థలు ముఖచిత్ర కథనాలను ప్రచురిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా మోడీ యంత్రాంగం మూలనపడిపోయిందని భావించి తన హక్కులను కాపాడుకునే చేవ ప్రదర్శిస్తుందో లేదా సర్కార్ ఇంకా పని చేస్తున్నదని భావించి దాని ఆటలకు ఆస్కారమిస్తుందో వేచిచూడాలి.










