Nov 07,2023 01:22

మాట్లాడుతున్న జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : న్యాయవాదులు వృత్తిపట్ల అంకిత భావంతో ఉండాలని సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది నాగండ్ల చలపతిరావు చిత్రపట ఆవిష్కరణ సభ గుంటూరు బార్‌ అసోసియేషన్‌ భవనంలో సోమవారం నిర్వహించారు. సభకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.వి.కె.సురేష్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాదులు వృత్తిపట్ల అంకిత భావంతో పని చేయాలని, జూనియర్‌ న్యాయవాదులు నిరంతరం మెలకువులు తెలుసుకోవాలని అన్నారు. ఇటీవల కాలంలో న్యాయమూర్తులు, న్యాయవాదులపై, న్యాయవ్యవస్థపై దాడులు జరిగాయని, వీటిపట్ల న్యాయవాదులు అప్రమత్తంగా ఉండి వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పారు. తన సీనియర్‌ న్యాయవాది చిత్రపటాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు రావటం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌పోలియో జడ్జి జస్టిస్‌ జి.నరేందర్‌ మాట్లాడుతూ న్యాయవాదులు సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యామ్‌ప్రసాద్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్‌.బి.జి.పార్థసారధి, ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు గంటా రామారావు, న్యాయవాదులు, చలపతిరావు జూనియర్‌ న్యాయవాదులు స్వాతి, వసంతకుమార్‌, కుటుంబ సభ్యులు, బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తొలుత గుంటూరు వచ్చిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.యస్‌.బి.జి.పార్ధసారధి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి స్వాగతం పలికారు.