
ప్రజాశక్తి - పాలకొల్లు
న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని పలువురు డిమాండ్ చేశారు. పాలకొల్లు కోర్టు ఆవరణలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పాలకొల్లు మహాసభ శుక్రవారం నిర్వహించారు. ఈ మహాసభకు ఐలు జిల్లా సభ్యులు కొప్పర్తి వెంకటసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. న్యాయవాద వృత్తి ప్రమాదంలో పడిందని చెప్పారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. చనిపోయిన న్యాయవాదులకు బెనిఫిట్ ఫండ్ సక్రమంగా చెల్లించడం లేదని, మెడికల్ హెల్త్ కార్డులు లేనందున న్యాయవాదులు తగిన వైద్యం అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. కొత్తగా వచ్చిన వారికి కనీసం రూ.పది వేలు స్టైఫండ్ ప్రభుత్వమే ఇవ్వాలని, ఎస్‌సి, ఎస్‌టి జూనియర్ న్యాయవాదులకు కనీసం రూ.ఎనిమిది వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాదులపై ఇటీ వల పోలీసులు పెట్టిన కేసులపై ఎఎల్‌యు తరపున పోరాడ తామని చెప్పారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకు న్నారు. పాలకొల్లు ఎఎల్‌యు అధ్యక్షులుగా కెవి.సుబ్రహ్మ ణ్యం, కార్యదర్శిగా పామర్తి నగేష్ 13 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ మహాసభలో కార్యదర్శి వి.నాగరాజు, పామర్తి నగేష్, ఎస్‌కె.రామలింగేశ్వరరావు, సిహెచ్.జయ రాజు, ఎంవి.రంగారావు, బి.సునీత, దుర్గ పాల్గొన్నారు.