ప్రజాశక్తి-చీరాల: న్యాయవాదులు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా చీరాల న్యాయస్థాన ప్రాంగణం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షు లు బూదరాజు శశి కిరణ్ మాట్లాడుతూ ఎంతోకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న న్యాయవాదుల అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల గేటు వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసనలో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రధానంగా న్యాయవాదుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం కావాలని, న్యాయవాదుల డెత్ బెనిఫిట్ రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నదని అన్నారు. చనిపోయిన న్యాయవాదుల డెత్ బెనిఫిట్‌కు ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉందని, న్యాయ నేస్తం ప్రతి నెల ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరి హక్కుల రక్షణకు పాటుపడే న్యాయవాదులు నేడు తమ హక్కులను రక్షించుకోవడానికి నిరసన చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో నిరసన తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఈ నిరసనలో భాగంగా న్యాయదేవతకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఎంవి చలపతి రావు, ఉదరు భాస్కర్, ఐఏఎల్ పట్టణ అధ్యక్షులు కరవది భాను ప్రకాష్, చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, ఉపాధ్యక్షులు శ్రీమతి పి విజయలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి మేరుగ రవి కుమార్, వర్కింగ్ సెక్రటరీ మొపూరి తారక రామారావు, జె శ్రీనాథ్ మంకేన అశోక్ కుమార్, మహిళా న్యాయవాదులు శ్రీమతి శకుంతల, శ్రీమతి కొండమ్మ, గౌతమి, టివి శైలజ తదితరులు పాల్గొన్నారు.










