ప్రజాశక్తి-ఆలూరు
ఆదోని న్యాయవాది కల్యాణ్ రెడ్డిపై దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు పెట్టడం పోలీసులకు తగదని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఎఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.సురేంద్ర కుమార్, ఆలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీసుల దాడులకు వ్యతిరేకంగా కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదోని న్యాయవాది కల్యాణ్ రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడి, అక్రమ కేసులు పెట్టిన 3వ పట్టణ పోలీసులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను, అక్రమ కేసులను అరికట్టేందుకు న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ఇవ్వాల్సిన డెత్ బెనిఫిట్ మ్యాచింగ్ గ్రాంట్ బకాయి రూ.30 కోట్లు విడుదల చేయాలని కోరారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 35 ఏళ్లు నిండిన న్యాయవాదులందరికీ వెల్పేర్ ఫండ్ అవకాశం కల్పించాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం ప్రతినెలా తప్పకుండా ఇవ్వాలని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, ఇప్పటివరకు రూ.30 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. మిగిలిన రూ.70 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు. న్యాయవాదులు వాయుజీవోత్తమ రావు, కె.సిద్ధప్ప, సి.ప్రవీణ్ కుమార్, రంగప్ప, ఆర్.షేక్షావలీ, రాజగోపాల్ నాయుడు, వీరేష్, ఈరన్న రావు, చాంద్ బాషా, ప్రసాద్ రావు, నాగేంద్ర, షాకీర్, రాజేష్ పాల్గొన్నారు.
కోర్టు ఎదుట నిరసన తెలుపుతున్న న్యాయవాదులు










