Nov 27,2022 21:17

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వెంకట శేషసాయి
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

న్యాయవాద వృత్తికి నిబద్ధత ఎంతో అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ.వెంకట శేషసాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌, ఏలూరు బార్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని బివి.రంగారెడ్డి ప్రాంగణంలో ఆదివారం న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సును హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ ఎ. వెంకట శేషసాయి, హైకోర్టు న్యాయమూర్తి, పశ్చిమగోదావరి పోర్టుపోలియో జడ్జి జస్టిస్‌ సిహెచ్‌.మానవేంద్రనాథ్‌రారు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నైనాల జయసూర్య, జస్టిస్‌ సుబ్బారెడ్డి సత్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సదస్సుకు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు గంటా రామారావు అధ్యక్షత వహించగా జిల్లా జడ్జి జస్టిస్‌ సి.పురుషోత్తమకుమార్‌, కేంద్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎ.రామిరెడ్డి, ఎపి బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బివి.కృష్ణారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ టి.శశిధర్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వెంకట శేషసాయి మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఉన్నవారు నిబద్దత, నైతికవిలువలు కలిగి ఉండాలన్నారు. నిరంతర అధ్యయనంతోనే ఆ రంగంలో ఉత్తమంగా నిలిచేందుకు అవకాశం ఉందన్నారు. వివిధ కేసుల్లో న్యాయమూర్తుల తీర్పులను బాగా చదవాలన్నారు. ప్రాథమిక హక్కులు, చట్టాన్ని అన్వయించే పద్దతి, కేసుల విస్తృతి, సీనియర్లు వాదించే పద్దతిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పౌర శిక్షాస్మృతి పరిధిలోని మధ్యంతర పిటీషన్లు, సమగ్ర విచారణ, కేసు తీరుతెన్నులు క్షుణంగా తెలుసుకోవాలని ఆయా అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా యువ న్యాయవాదులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఇటువంటి సెమినార్లు జూనియర్‌ న్యాయవాదులకు, ప్రాక్టీస్‌లో ఉన్న న్యాయవాదులకు, న్యాయ పరీక్షలు రాసేవారికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్‌ సిహెచ్‌.మానవేంద్రనాథ్‌రారు ఈ సందర్బంగా నేర శిక్షాస్మృతి పునశ్ఛరణ అంశాన్ని విపులీకరించారు. నేర సంబంధిత కేసుల్లో సమగ్ర పరిశీలన ఎంతో అవసరమన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నైనాల జయసూర్య, జస్టిస్‌ సుబ్బారెడ్డి సత్తి లీగల్‌ అవేర్నెస్‌, స్టాండర్స్‌ తదితర వాటి గురించి వివరించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తులు ఎ.వెంకట శేషసాయి, సిహెచ్‌.మానవేంద్రనాథ్‌రారు, నైనాల జయసూర్య, సుబ్బారెడ్డి సత్తిలను శాలువాలతో సత్కరించారు. తొలుత హైకోర్టు న్యాయమూర్తి, సిహెచ్‌.మానవేంధ్రనాథ్‌రారు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.