Sep 06,2023 19:18

ప్రజాశక్తి - తణుకురూరల్‌
కోర్టుకొచ్చే కక్షిదారులకు న్యాయసేవలందించడంలో ఐలు సభ్యులు ముందుండాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి, న్యాయవాది పుట్టా వేణుగోపాలచౌదరి అన్నారు. బుధవారం ఐలు తణుకు యూనిట్‌ మహాసభ ఎం.సత్యనారాయణాచార్యులు అధ్యక్షతన తణుకు బార్‌ అసోసియేషన్‌ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాలచౌదరి మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, కక్షిదారుల ప్రయోజనం కోసం ఐలు అలుపెరుగని పోరాటాలు చేసిందన్నారు. న్యాయవాదుల వృత్తి రక్షణ కోసం, న్యాయవాది రక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం నేడు ఉందన్నారు. తణుకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సూరంపూడి కామేష్‌ మాట్లాడుతూ జూనియర్‌ న్యాయవాదులు, సీనియర్‌ న్యాయవాదుల సలహాలు తీసుకుంటూ వృత్తిలో నైపుణం సాధించాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా ఎం.సత్యనారాయణాచార్యులు, అధ్యక్షులుగా కౌరు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కెఎల్‌ సత్యవతి, కార్యదర్శిగా ఎన్‌.సోమేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా చింతపల్లి నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.సత్యనారాయణమూర్తి, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి, కె.గిరిజ, డి.అప్పారావు, కె.పురుషోత్తం, బివివి విక్టర్‌బాబు పాల్గొన్నారు.