
ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : భవిష్యత్తులో ఎప్పుడైనా, ఎక్కడైనా న్యాయమే గెలుస్తుందని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. గురువారం స్థానిక ఎస్‌ఎన్‌ఎం నగర్‌లో గల బంగ్లాలో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయమైన పాలనకు చమరగీతం పాడేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలైనట్టు తెలిపారు. ఇక అధికార పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని, కురుపాము నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన టిడిపి హయాంలో 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన 10శాతం ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేసిందని విమర్శించారు. తాను పార్వతీపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి రూ.25 లక్షలు విలువచేసే తాగునీటి ట్యాంకను మున్సిపాల్టీకి అందజేశానని, ఆ ట్యాంక్ నిర్వహణను చేయకుండా మూలకు చేర్చారని విమర్శించారు. వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు, వేధింపులకు, దాడులకు గురవుతున్నారని, త్వరలో టిడిపి హయాంలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని అన్నారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు మజ్జి కృష్ణ మోహన్ పాల్గొన్నారు.