ప్రజశక్తి - చీరాల
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అవినీతికి పాల్పడిన చంద్రబాబును న్యాయస్థానం జైలుకి పంపించిన విషయంలో న్యాయమే గెలిచిందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి అన్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. స్థానిక అమ్మ కంటి హాస్పిటల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.300 కోట్లుకుపైగా అవినీతికి పాల్పడ్డారనే పక్క ఆధారాలతోనే సిఐడి అరెస్టు చేసి కోర్టుకు తరలించిందని అన్నారు. న్యాయస్థానం పూర్తి దర్యాప్తు చేపట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్‌పై పంపిందన్నారు. ఇందులో ఎలాంటి కుట్ర జరగలేదని ఆయన స్పష్టం చేశారు. టిడిపి నేతలు ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాన్ని తప్పు దోవ పట్టించే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టుతో సానుబూతి పొందాలనుకుంటున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. వాడరేవుకు చెందిన హరిజిల్లి ప్రసాదు బాపట్ల జిల్లా మత్స్యకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులు అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో సత్కరించారు. ముక్కోణంపార్కు సెంటర్లో పాలకవర్గం ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో విషయంలో దళితుల మనోభావాలను గౌరవిస్తూ పార్లమెంట్ నమూనాతో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చుండూరు వాసు, సిహెచ్ చిరంజీవి, దేవరపల్లి కుమార్ బాబు, బొంతగర్ల బాబురావు, గోసాల అశోక్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.










