Feb 20,2023 23:46

ఆందోళన చేస్తున్న నేవీ నిర్వాసితులు

ప్రజాశక్తి -రాంబిల్లి
తమకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఎన్‌ఎఒబి నిర్వాసిత జెఎసి నాయకులు స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వాడనర్సాపురం వద్ద నేవీ ప్రధాన గేట్‌ ముందు ఎన్‌ఎఒబి నిర్వాసితులు చేస్తున్న ఆందోళన సోమవారం నాటికి 113వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నిర్వాసిత జెఎసి నాయకులు మాట్లాడుతూ నేవీ నిర్మాణంతో 8 గ్రామాల నిర్వాసితులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఈ విషయం అందరికీ తెలిసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి ఎంత అన్యాయం జరిగిందో చూడకుండా, కొన్ని గ్రామాలను మాత్రమే గుర్తించి జీవన భృతి కల్పిస్తామని చెప్పడం తగదన్నారు. కొన్ని గ్రామాలను గుర్తించకుండా, వారిని ఇబ్బందులకు గురి చేయడంతో కొప్పుగొండపాలెం, వాడపాలెం, చిన్న కలవలపల్లి, కొత్తపేట, గోవింద పాలెం, నేవీ కాలనీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందరినీ సమానంగా చూడవలసిన ప్రభుత్వాలు, ఒకరిని ఒకలాగా మరొకరిని మరోలాగా చూసి విభజించి పాలించు పద్ధతిలో వ్యవహరించడం దారుణమన్నారు. జిల్లా అధికారి యంత్రాంగం, ప్రభుత్వాలు తమ పట్ల వివక్ష చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాల పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.