ప్రజాశక్తి-రాంబిల్లి
తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని నేవీ నిర్వాసిత జెఎసి పెద్దలు స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వాడనర్సాపురం వద్ద ఎన్‌ఎఒబి ప్రధాన గేట్ ముందు నేవీ నిర్వాసితులు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి 111వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జెఎసి పెద్దలు మాట్లాడుతూ నరసాపురం, కొత్త పట్నం గ్రామాల వారికే ఉపాధి కల్పిస్తామని అధికారులు చెప్పడం సరికాదని, అలా అయితే మిగిలిన ఆరు గ్రామాలు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీని వల్ల ఆయా గ్రామాలు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. తమ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోకపోవడం దుర్మార్గమన్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు చిన్న, పెద్ద, ఆడ మగ అందరం గేట్ ఎదుటే ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ ప్యాకేజీలు చెల్లించాలని, జెట్టీ నిర్మాణం చేపట్టాలని, అంత వరకు ఆధార్ ఆధారంగా శారదా, వరహ నదుల గుండా చేపల వేటకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాల నేవీ నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










