సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజలకు, ముఖ్యంగా బాధితులకు సత్వర న్యాయం అందని ద్రాక్షేనని రిపబ్లిక్‌డే సమయాన వెల్లడి చేసిన ఇండియన్ జస్టిస్ రిపోర్టు తేటతెల్లం చేసింది. మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిధులు, సిబ్బంది కొరత ఇత్యాది సమస్యలు 'సత్వర న్యాయ' లక్ష్యానికి అడ్డంకి కాగా కేంద్రంలో బిజెపి వచ్చాక ఏకంగా రాజ్యాంగానికే గండి పడటంతో ప్రజలకు న్యాయం అత్యంత ప్రమాదంలో పడింది. నయా-ఉదారవాద చట్రంలో చేస్తామంటున్న న్యాయ సంస్కరణలు ప్రజలను న్యాయానికి ఇంకా దూరం చేస్తాయి. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో తాజాగా 2020 ఏడాది రిపోర్టు విడుదలైంది. జ్యుడీషియరీ, పోలీస్, జైళ్లు, న్యాయ సహాయం తదితర అంశాలను 18 పెద్ద, మధ్యతరహా, చిన్న రాష్ట్రాల్లో పరిశీలించి వివరాలను పొందుపర్చింది. ప్రజలకు న్యాయం అందే విషయంలో అథమ స్థానంలో ఉన్న ఐదు పెద్ద రాష్ట్రాల్లో నాలుగు బిజెపి ఏలుబడిలోనివే. దారుణంగా ఉన్న రాష్ట్రాలు వరుసగా కర్నాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్. వీటిలో బెంగాల్ మినహా తక్కినవన్నీ బిజెపి అధికారం చెలాయిస్తున్నవే. మహిళలపై అత్యాచారాలు జరిగితే బాధితులు హిందువులు కాదు కదా అని బరితెగించే, బిజెపి, మోడీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సెలవిచ్చే యోగి ఆదిత్యనాథ్ రాజ్యం చేస్తున్న యు.పి ప్రజలకు న్యాయం అందించడంలో ఘోరంగా ఉండటం గమనార్హం.
ప్రధాని మోడీ పాల్గొన్న ఒక సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒకరు అన్ని కోర్టుల్లో కొండలా పెరిగిపోతున్న పెండింగ్ కేసులపై కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాతైనా స్థితిగతులు మారాయా అంటే లేనే లేదని 'జస్టిస్ రిపోర్టు' కుండబద్దలు కొట్టింది. హైకోర్టుల్లో 47 లక్షలు, జిల్లా కోర్టుల్లో మూడున్నర కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని స్టడీ తేల్చింది. ఇంతగా కేసులు పెండింగ్ పడటానికి కారణం సరిపడ మౌలిక సదుపాయాలు లేకపోవడమే. జడ్జిలు మొదలుకొని సబార్డినేట్ స్టాఫ్ వరకు పోస్టుల భర్తీ ఏళ్ల తరబడి జరగట్లేదు. మంజూరైన పోస్టులు ఖాళీ పెట్టడం ఒక ఎత్తయితే, అవసరాలకు తగ్గట్టు పోస్టులు పెంచకపోవడం మరొక ఎత్తు. 1987లో లా కమిషన్ ప్రతి 20 వేల జనాభాకు ఒక జడ్జి ఉండాలని సిఫారసు చేయగా, మూడు దశాబ్దాల అనంతరం చూసినా సగటున 50 వేల మందికి ఒకరున్నారు. బీహార్, బెంగాల్, తెలంగాణ, యు.పి లో లక్ష మందికి ఒక జడ్జి ఉన్నారు. నేషనల్ పోలీస్ కమిషన్ 1981లో చేసిన సిఫారసు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 150 చదరపు కిలోమీటర్లకొక పోలీస్‌స్టేషన్ ఉండాలి. రాజస్థాన్ వంటి చోట్ల 695 చదరపు కిలోమీటర్లకొక స్టేషన్ ఉంది. జైళ్లు సైతం కిక్కిరిశాయి. జైళ్లల్లో ఉన్న వారిలో సగం మంది అండర్ ట్రైలర్లు. జైళ్లలో మూడింట ఒక వంతు పోస్టులు ఖాళీ.
బాధితులకు లీగల్ ఎయిడ్ దారుణంగా ఉంది. 25 శాతం మందికి కూడా ప్రభుత్వపరంగా న్యాయ సహాయం అందట్లేదు. జ్యుడీషియరీ, పోలీస్, ప్రిజన్స్, లీగల్ విభాగాల్లో ఎస్.సి, ఎస్.టి, మహిళల శాతం చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జ్యుడీషియరీలో దేశంలోనే అతి తక్కువ మహిళలు (19 శాతం) ఉన్నారు. ఎ.పి కింది కోర్టుల్లో అత్యధికంగా 70 శాతానికిపైగా సిబ్బంది ఖాళీలున్నాయి. కేంద్రంలో బిజెపి వచ్చాక బాధితులకు న్యాయం సంగతేమో, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన సాగుతోంది. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులను నిలువరించేందుకు ఇనుప మేకులు, ఇనుప బారికేడ్లు, సిమెంట్ దిమ్మెల ప్రయోగం ప్రభుత్వ కర్కశానికి నిదర్శనం. బిజెపి పాలిత రాష్ట్రాలతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రజా ఉద్యమాలపై, ప్రభుత్వ వ్యతిరేక నిరసనపై అమలు చేస్తున్న నిర్బంధంతో మానవ, ప్రజాతంత్ర హక్కులు కాలరాయబడుతున్నాయి. ప్రజలకు న్యాయం అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానానికి తగ్గడం ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ప్రభుత్వమూ తగు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. బాధితులకు న్యాయం అందించాల్సిన బాధ్యత పాలకులది. సత్వరం న్యాయం అందించలేకుంటే జరిగేది ప్రజలకు అన్యాయమే.










